Odisha: రణరంగమైన ఒడిశా అసెంబ్లీ... స్పీకర్ పై చెప్పులు విసిరిన బీజేపీఎమ్మెల్యేలు!

Shoes Hurled by BJP MLAs on Odisha Speaker in Assembly
  • లోకాయుక్త సవరణ బిల్లుకు ఆమోదం
  • చర్చించకుండా ఎలా ఆమోదిస్తారని బీజేపీ ఆగ్రహం
  • ముగ్గురు సభ్యులను సస్పెండ్ చేసిన స్పీకర్
ఒడిశాలో శనివారం నాటి అసెంబ్లీ సమావేశం రణరంగాన్ని తలపించింది. బీజేపీ ఎమ్మెల్యేలు స్పీకర్ పై చెప్పులు విసిరేయడం కలకలం రేపింది. అసెంబ్లీలో లోకాయుక్త సవరణ బిల్లుపై చర్చించకుండానే ఆమోదించడంపై బీజేపీ సభ్యులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తమకు మాట్లాడేందుకు కావాలనే అవకాశం ఇవ్వలేదని ఆరోపిస్తూ, పోడియం వైపు దూసుకెళ్లి, స్పీకర్ పాత్రోపై చెప్పులు, మైక్రోఫోన్ లు, కాగితాలను విసిరేశారు. దీంతో తీవ్ర గందరగోళం చెలరేగగా, సభను వాయిదా వేసిన స్పీకర్, ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలను సమావేశాలు ముగిసేవరకూ సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు. అసెంబ్లీలో బీజేపీ ఉపనాయకుడు బీసీ సేథీ, పార్టీ విప్‌ మోహన్‌ మాఝీ, ఎమ్మెల్యే జేఎన్‌ మిశ్రాలను సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు.

ఆపై సభ తిరిగి ప్రారంభమైన తరువాత షెడ్యూల్ కన్నా ఐదు రోజుల ముందే నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు. అంతకుముందు గనుల తవ్వకం విషయంలో రాష్ట్రంలో అవినీతి జరుగుతోందని, దీనిపై చర్చించాలని కాంగ్రెస్ సభ్యులు డిమాండ్ చేసినా స్పీకర్ అంగీకరించలేదు. దీంతో బీజేపీ ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ సభ్యులు కూడా జతకలిసి, సభలో గొడవకు దిగారు. ఈ గొడవ మధ్యే ఆర్థిక మంత్రి నిరంజన్ పూజారీ, కాగ్ సమర్పించిన రిపోర్టును సభ ముందుంచారు.

సభ వాయిదా పడిన అనంతరం బీజేపీ నేత పీకే నాయక్ మాట్లాడుతూ, తమ సభ్యులు సభలో ఎటువంటి తప్పూ చేయలేదని వ్యాఖ్యానించడం గమనార్హం. కనీసం తమ అభిప్రాయాలను చెప్పుకునేందుకు కూడా వారికి అవకాశం ఇవ్వలేదని, ఆ కారణంతోనే వారు అలా ప్రవర్తించారని అసెంబ్లీలో ప్రజాస్వామ్యానికి విలువ లేకుండా పోయిందని నాయక్ విమర్శించారు.

Odisha
Speaker
Assembly
Suspend
BJP

More Telugu News