అత్యాచార నిందితుడిని కాల్చిన మీరట్ పోలీసులు!

04-04-2021 Sun 08:36
  • పదో తరగతి బాలికపై అత్యాచారం
  • ఆపై సూసైడ్ చేసుకున్న బాలిక
  • కోర్టుకు తీసుకుని వెళుతుంటే తప్పించుకోబోయిన నిందితుడు
Police Open Fire on Rape Accused

పదో తరగతి చదువుతున్న బాలికను అత్యాచారం చేసి, ఆపై ఆమె ఆత్మహత్య చేసుకున్న కేసులో నిందితులుగా ఉన్న నలుగురిలో ఒకరిని మీరట్ పోలీసులు కాల్చాల్సి వచ్చింది. పోలీసు అధికారులు వెల్లడించిన మరిన్ని వివరాల ప్రకారం, నిందితులను కోర్టుకు తీసుకుని వెళుతుండగా, వారిలో ఒకడు పారిపోయేందుకు ప్రయత్నించాడు. దీంతో పోలీసులు అతనిపై ఫైరింగ్ ఓపెన్ చేశారు. ఈఘటనలో అతనికి గాయాలు కాగా, చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించామని మీరట్ రూరల్ ఎస్పీ కేశవ్ మిశ్రా తెలిపారు.

నిందితులు నలుగురూ బాలికపై గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారని, ఆపై ఆమె ఆత్మహత్యా లేఖను రాసి, నిందితుల పేర్లను వెల్లడిస్తూ, చనిపోయిందని, లేఖ ఆధారంగా నిందితులను అరెస్ట్ చేశామని ఆయన అన్నారు. నిందితుల్లో లఖన్ (18) అనే యువకుడు పోలీసు కస్టడీ నుంచి పారిపోయేందుకు ప్రయత్నించాడని కేశవ్ వెల్లడించారు. కోర్టుకు తీసుకుని వెళుతున్న క్రమంలో ఓ పోలీసు వద్ద ఉన్న ఉన్న తుపాకిని లాక్కొని, సమీపంలోని చెరుకు తోటలోకి పారిపోయాడని, దీంతో అతన్ని షూట్ చేయాల్సి వచ్చిందని తెలిపారు.