బెంగళూరులో వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ కేసులో టీఎస్ ప్రజా ప్రతినిధులు!

04-04-2021 Sun 10:11
  • ఇద్దరు వ్యాపారవేత్తలను విచారించిన పోలీసులు
  • నలుగురు ఎమ్మెల్యేల పేర్లు చెప్పిన నిందితులు
  • జాబితాలో టాలీవుడ్ ప్రముఖులు కూడా
Telangana MLAsin Bengaluru Drugs Scam

బెంగళూరులో వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ కేసులో తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఎమ్మెల్యేల పేర్లతో పాటు సినీ పరిశ్రమకు చెందిన వారి పేర్లు బయటకు రావడం ఇప్పుడు కలకలం రేపుతోంది. బెంగళూరులో పబ్ లు హోటల్స్ నిర్వహిస్తున్న హైదరాబాద్ వ్యాపారవేత్తలు రతన్ రెడ్డి, కలహర్ రెడ్డిలను విచారిస్తే మరిన్ని నిజాలు బయటకు వస్తాయని భావిస్తున్న పోలీసులు, వారికి నోటీసులు జారీ చేస్తూ, మార్చి 30న విచారణకు రావాలని పేర్కొనగా, ఇప్పటివరకూ వారు విచారణకు హాజరు కాలేదు. దీంతో వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులు భావిస్తున్నారు.

అంతకుముందు కన్నడ చిత్ర నిర్మాత శంకర్ గౌడను ఇదే కేసులో విచారించిన వేళ, రతన్ రెడ్డి పేరు బయటకు వచ్చింది. శంకర్ గౌడ కుమార్తె పుట్టిన రోజు పార్టీలో హైదరాబాద్ వ్యాపారి సందీప్ రెడ్డి, కలహర్ రెడ్డిలతో పాటు రాష్ట్రానికి చెందిన ఓ ఎమ్మెల్యే, శ్రీను రెడ్డి అనే మరో వ్యక్తి పాల్గొన్నారని పోలీసులు గుర్తించారు. ఓ కన్నడ స్టార్ కు చెందిన హోటల్ లో జరిగే పార్టీలకు రతన్, కలహర్ లు హైదరాబాద్ నుంచి సినీ, రాజకీయ ప్రముఖులను తీసుకుని వస్తుండేవారని కూడా పోలీసు వర్గాలు వెల్లడించాయి.

ఇదే కేసులో కీలక సూత్రధారిగా పోలీసులు భావిస్తున్న మస్తాన్ చంద్ర అనే వ్యక్తిని విచారించగా, పలువురు తెలంగాణ నేతలు, ప్రముఖుల పేర్లు బయటకు వచ్చాయని బెంగళూరు పోలీసు వర్గాలు వెల్లడించాయి. ఈ జాబితా పెద్దదిగానే ఉందని, హైదరాబాద్ నుంచి వచ్చే బృందం పాల్గొనే పార్టీల్లో తప్పనిసరిగా కనిపించే మస్తాన్ చంద్ర, వారికి డ్రగ్స్ సరఫరా చేస్తుండేవాడని కూడా పోలీసులు అనుమానిస్తున్నారు.

ఈ పార్టీలకు సంబంధించిన సీసీటీవీ కెమెరాల ఫుటేజీలను స్వాధీనం చేసుకున్న పోలీసులు, అందులో హైదరాబాద్ ప్రముఖులను గుర్తించారు. వారి సెల్ ఫోన్లలో తీసుకున్న ఫోటోలను కూడా సేకరించామని, వారి సెల్ ఫోన్ టవర్ లొకేషన్లు వంటి టెక్నికల్ ఎవిడెన్స్ ను సిద్ధం చేశామని, ఒక్కొక్కరిగా విచారించాలని నిర్ణయించుకున్నామని పోలీసు ఉన్నతాధికారులు అంటున్నారు. ఈ పార్టీల్లో వాడిన మత్తుమందులు విదేశీ నౌకల ద్వారా విశాఖ మీదుగా నగరానికి వస్తున్నాయని బెంగళూరు పోలీసులు తమ ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు.

ఈ కేసులో ఆరోపణలను ఎదుర్కొంటున్న తెలంగాణ ప్రముఖుల పేర్లు మాత్రం బయటకు రాకపోయినా, ఈ విషయం అధికార టీఆర్ఎస్ పార్టీలో కలకలం రేపింది. డ్రగ్స్ దందాలో భాగం పంచుకున్న వారు ఎవరన్న విషయమై పెద్ద చర్చే జరుగుతోంది.