బంగ్లాదేశ్ లో మహమ్మారి వీర విజృంభణ... లాక్ డౌన్ పెట్టిన ప్రభుత్వం!

04-04-2021 Sun 07:13
  • వారం రోజుల పాటు లాక్ డౌన్ అమలు
  • ఒక్క రోజులో 6,800 కేసులు రావడంతో నిర్ణయం 
  • ఎమర్జెన్సీ సేవలకు అనుమతి
Another Lockdown in Bangladesh

కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో, వారం రోజుల లాక్ డౌన్ ను విధిస్తున్నట్టు బంగ్లాదేశ్ ప్రకటించింది. సోమవారం నుంచి ఏడు రోజుల పాటు ఇది కొనసాగుతుందని బంగ్లాదేశ్ రోడ్డు, రవాణా శాఖా మంత్రి ఒబైదుల్ ఖాదర్ వెల్లడించారు. ఇదే సమయంలో ఎమర్జెన్సీ సేవలతో పాటు పరిశ్రమలను లాక్ డౌన్ నుంచి మినహాయిస్తున్నామని అన్నారు.

తాజాగా, 24 గంటల వ్యవధిలో 6,800కు పైగా కేసులు రావడం, మరణాల సంఖ్య 50గా నమోదు కావడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని తెలిపారు. ప్రజలు కరోనా నిబంధనలను పాటించాలని, అత్యవసరమైతేనే ఇంటి నుంచి బయటకు రావాలని ఒబైదుల్ కోరారు. కరోనాను నియంత్రణలోకి తేవాల్సిన అవసరం ఉందని, అందుకే మరోమారు నిబంధనలతో కూడిన లాక్ డౌన్ ను విధిస్తున్నామని స్పష్టం చేశారు.