పరారీలో బాలీవుడ్ నటుడు గౌరవ్ దీక్షిత్!

04-04-2021 Sun 06:47
  • ఇటీవల అరెస్ట్ అయిన అజాజ్ ఖాన్
  • విచారణలో గౌరవ్ దీక్షిత్ పేరు
  • దాడులు చేయగా, ఇంట్లో దొరికిన డ్రగ్స్
Bollywood Actor Gaurav Dixit Missing After NCB Raids

బాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఇటీవల అరెస్ట్ అయిన అజాజ్ ఖాన్ ను విచారించిన అధికారులు, అతన్నుంచి అందిన సమాచారంతో నటుడు గౌరవ్ దీక్షిత్ ఇంటిపై దాడి చేయగా, భారీ ఎత్తున నిషేధిత మాదకద్రవ్యాలు లభ్యమైన నేపథ్యంలో, అతను అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. కొన్ని చిన్న సినిమాలతో పాటు టీవీలోనూ గౌరవ్ నటించాడు. ముంబైలోని లోఖండ్ వాలా ప్రాంతంలో యాంటీ డ్రగ్స్ ఏజన్సీ దాడులు చేయగా, ఎండీఎంఏ, హాస్ హిష్ లతో పాటు డ్రగ్స్ ప్యాకేజింగ్ ఉపకరణాలు లభించాయి.

ఈ దాడులు జరుగుతున్న సమయంలోనే గౌరవ్ దీక్షిత్, తన విదేశీ స్నేహితురాలితో అక్కడికి వచ్చాడని, ఎన్సీబీ టీమ్ చూసి, అక్కడి నుంచి అతను పారిపోయాడని ఓ అధికారి తెలిపారు. గౌరవ్ కోసం గాలిస్తున్నామని తెలిపారు. కాగా, బుధవారం నాడు నటుడు అజాజ్ ఖాన్ ను ఎన్సీబీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆపై అతన్ని మూడు రోజుల పాటు విచారించారు. అతని నివాసం నుంచి అల్ ప్రాజోలమ్ టాబ్లెట్లను స్వాధీనంచేసుకున్నారు.

తన ఇంట్లో డ్రగ్స్ దొరకడంపై తొలుత స్పందించిన ఖాన్, తనకేమీ తెలియదని, వాటిని ఎక్కడి నుంచి తెచ్చారో అధికారులనే అడగాలని అన్నారు. వారికి కేవలం నాలుగు నిద్రమాత్రలు మాత్రమే దొరికాయని, తన భార్య డిప్రషన్ లో ఉందని, వాటిని ఆమె తీసుకుంటోందని చెప్పడం గమనార్హం. ఆపై పోలీసులు తమదైన శైలిలో విచారించిన తరువాత గౌరవ్ దీక్షిత్ పేరును బయటపెట్టాడు. ఇటీవలి కాలంలో బాలీవుడ్ లో జరుగుతున్న డ్రగ్స్ దందాపై పోలీసులు ఉక్కుపాదం మోపిన సంగతి తెలిసిందే.

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య తరువాత విచారణ ప్రారంభించిన ఎన్సీబీ, పలువురిని విచారించింది. ఈ జాబితాలో బాలీవుడ్ స్టార్స్ దీపికా పదుకొనే, అర్జున్ రామ్ పాల్, శ్రద్ధా కపూర్, సారా అలీ ఖాన్ వంటి వారు చాలా మంది ఉన్నారన్న సంగతి తెలిసిందే.