Maharashtra: ముంబయిలో మళ్లీ కరోనా ఉద్ధృతి.. రికార్డు స్థాయిలో కేసులు!

  • ఒక్కరోజు వ్యవధిలో 9,090 కొత్త కేసులు
  • 27 మందిని బలితీసుకున్న మహమ్మారి
  • 83 శాతానికి పడిపోయిన రికవరీ రేటు
  • నగరంలో అత్యధికంగా 62,187 క్రియాశీలక కేసులు
Highest ever corona cases in Mumbai

దేశవ్యాప్తంగా మరోసారి కరోనా విజృంభణ కొనసాగుతోంది. ముఖ్యంగా మహారాష్ట్రలో భారీ స్థాయిలో కొత్త కేసులు వెలుగులోకి వస్తున్నాయి. ఇక ఆ రాష్ట్ర రాజధాని ముంబయిలో వైరస్‌ విజృంభణకు అడ్డుకట్ట లేకుండా పోయింది. గత 24 గంటల్లో నగరవ్యాప్తంగా 9,090 కరోనా కేసులు నమోదైనట్లు బృహత్‌ ముంబయి కార్పొరేషన్‌ (బీఎంసీ) అధికారులు వెల్లడించారు. మరో 27 మంది మరణించినట్లు తెలిపారు. భారత్‌లో వైరస్‌ వెలుగులోకి వచ్చిన తర్వాత ముంబయిలో ఈ స్థాయి కొత్త కేసులు నమోదుకావడం ఇదే తొలిసారి.  

ఇక ఒక్క రోజు వ్యవధిలో 5,322 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ముంబయిలో రికవరీల సంఖ్య 3,66,365కు చేరింది. ఇటీవలి భారీ స్థాయి కొత్త కేసుల నేపథ్యంలో ఆసుపత్రిలో చేరుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. దీంతో రికవరీ రేటు 83 శాతానికి పడిపోయింది. ప్రస్తుతం ముంబయిలో 62,187 క్రియాశీలక కేసులు ఉన్నాయి.  

బీఎంసీ గణాంకాల ప్రకారం.. చనిపోయిన వారిలో 20 మంది దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అలాగే ఒకరు 40 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్నవారు, 19 మంది 60 ఏళ్లు పైబడినవారు కాగా.. ఏడుగురు 40-60 ఏళ్ల మధ్య వయసు ఉన్నవారు.

More Telugu News