చంద్రబాబు నిర్ణయం వల్ల వైసీపీకే ఉపయోగం: బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి

03-04-2021 Sat 19:27
  • పరిషత్ ఎన్నికలు బహిష్కరించాలని టీడీపీ నిర్ణయం
  • పరోక్షంగా వైసీపీకి మేలు జరుగుతుందన్న విష్ణు
  • రెండు పార్టీల కుట్ర అని ఆరోపణ
  • కపట నాటకం ఆడుతున్నాయంటూ విమర్శలు
BJP leader Vishnu Vardhan Reddy slams Chandrababu for quitting Parishat polls

పరిషత్ ఎన్నికలు బహిష్కరించాలని టీడీపీ పొలిట్ బ్యూరో తీసుకున్న నిర్ణయంపై ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి ఎస్.విష్ణువర్ధన్ రెడ్డి స్పందించారు. 'చంద్రబాబు గారూ... మీ నిర్ణయం వల్ల ఎవరికి ఉపయోగం?' అంటూ వ్యాఖ్యానించారు. మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసిన మీరు నేటి జడ్పీటీసీ ఎన్నికలు ఎందుకు ఎదుర్కొనడంలేదని ప్రశ్నించారు. 'ఉన్నపళంగా టీడీపీ ఎన్నికలు బహిష్కరించడం అంటే వైసీపీకి పరోక్షంగా మేలు చేయడమే కదా?' అని అభిప్రాయపడ్డారు.

"బహిష్కరణ వెనుక మీ రెండు పార్టీల కుట్ర ఉంది. మీరు అధికారులు, పోలీసులు, ఇతర సిబ్బందిపై చేస్తున్న ఆరోపణలే నిజమైతే  తిరుపతి ఉప ఎన్నికల్లో టీడీపీ ఎందుకు పోటీ చేస్తున్నట్టు? ఇక్కడ ఎన్నికల పరిశీలకులు మినహాయించి మిగతా సిబ్బంది అంతా రాష్ట్రానికి చెందినవారే కదా.... టీడీపీ, వైసీపీ కపటనాటకం ఇది" అని విష్ణువర్ధన్ రెడ్డి విమర్శలు గుప్పించారు.