Axar Patel: ఐపీఎల్ లో కరోనా కలకలం... ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు అక్షర్ పటేల్ కు పాజిటివ్

  • ఏప్రిల్ 9 నుంచి ఐపీఎల్ 14వ సీజన్
  • ముంబయి వాంఖెడే స్టేడియం సిబ్బందికి కరోనా
  • ఆటగాళ్లలోనూ కరోనా వ్యాప్తి
  • ఐసోలేషన్ కు అక్షర్ పటేల్
  • కరోనా నుంచి కోలుకుని జట్టుతో కలిసిన నితీశ్ రాణా
Delhi Capitals player Axar Patel tested positive for corona

ఐపీఎల్ తాజా సీజన్ ఈ నెల 9న ప్రారంభం కావాల్సి ఉండగా, కరోనా కలకలం రేగింది. ఇప్పటికే ముంబయి వాంఖెడే మైదానం సిబ్బంది కరోనా బారినపడగా, ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఆటగాడు అక్షర్ పటేల్ సైతం కరోనా బాధితుల జాబితాలో చేరాడు. దాంతో అతడిని జట్టు నుంచి వేరుచేసి ఐసోలేషన్ కు తరలించారు. దీనిపై ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ ఓ ప్రకటన చేసింది. దురదృష్టవశాత్తు అక్షర్ కు పాజిటివ్ వచ్చిందని, అయితే నిబంధనల ప్రకారం అతడిని ఐసోలేషన్ కు తరలించినట్టు వెల్లడించింది.

కాగా, మార్చి 28న అక్షర్ పటేల్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో కలిసే సమయంలో కొవిడ్ నెగెటివ్ రిపోర్టు సమర్పించాడు. కానీ మరోసారి అతడికి పరీక్ష నిర్వహించడంతో కరోనా పాజిటివ్ అని వెల్లడైంది. అటు, కోల్ కతా నైట్ రైడర్స్ ఆటగాడు నితీశ్ రాణా కరోనా నుంచి కోలుకుని జట్టుతో కలిశాడు.

మైదాన సిబ్బంది, ఇటు ఆటగాళ్లు కరోనా బారినపడుతుండడంతో బీసీసీఐ ఇరకాటంలో పడింది. ముంబయిలో కరోనా విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో నిస్సహాయత వ్యక్తం చేసింది. వేదికలు మార్చేందుకు సమయం మించిపోయిందని వ్యాఖ్యానించింది. ముంబయి నుంచి మ్యాచ్ లను ఇతర వేదికలకు తరలించలేమని స్పష్టం చేసింది.

 మ్యాచ్ ల నిర్వహణ బృందం ఒక ప్రత్యేకమైన బబుల్ లో ఉంటే, ఆటగాళ్లు మరింత కఠినమైన మరో బబుల్ లో ఉన్నారని వివరించింది. బీసీసీఐ బ్యాకప్ వేదికల జాబితాలో హైదరాబాదు ఉన్నప్పటికీ, వారం రోజుల వ్యవధిలో వేదికలు మార్చడం చాలా కష్టసాధ్యం అని బోర్డు వర్గాలు అభిప్రాయపడ్డాయి.

More Telugu News