ఫ్యాక్షన్ మార్కు సెలక్షన్ ను ఎదిరించి గెలుపొందిన మీరే మాకు స్ఫూర్తి: నారా లోకేశ్

03-04-2021 Sat 17:15
  • ఇటీవలే ఏపీలో పంచాయతీ ఎన్నికలు
  • నేడు ప్రమాణస్వీకారం చేసిన విజేతలు
  • నూతన సర్పంచులు, వార్డు మెంబర్లకు లోకేశ్ శుభాకాంక్షలు
  • ఒత్తిళ్లకు తలొగ్గకుండా పనిచేయాలని సూచన
Nara Lokesh wishes newly elected in Panchayat polls

ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన వార్డు మెంబర్లు, సర్పంచులు నేడు పదవీప్రమాణ స్వీకారం చేశారు. ఈ నేపథ్యంలో నారా లోకేశ్ స్పందించారు. గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్య సాధకులుగా నేడు పదవీ ప్రమాణస్వీకారం చేస్తున్న పంచాయతీ సర్పంచులు, వార్డు మెంబర్లు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అంటూ ట్వీట్ చేశారు.

జగన్ అరాచక పాలనలో ఎలక్షన్ కాకుండా, ఫ్యాక్షన్ మార్కు సెలక్షన్ ను ఎదిరించి మరీ పోటీ చేసి గెలుపొందిన మీరు మా అందరికీ స్ఫూర్తి అని కొనియాడారు. దేశానికి ప్రధాని, రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎలాగో గ్రామ పంచాయతీకి సర్పంచ్ అలాగని వివరించారు.

సర్పంచులు ఏ ఒత్తిడికి తలొగ్గకుండా పనిచేయాలని, పంచాయతీలకు కేంద్రం నుంచి నేరుగా నిధులు వస్తాయని, నిధులు సద్వినియోగం చేసుకుని గ్రామాలలో అభివృద్ధికి పాటుపడాలని లోకేశ్ పిలుపునిచ్చారు. ప్రజల సమస్యలు పరిష్కరించి ఆదర్శంగా నిలవాలని, పదవీకాలం అంతా సాఫీగా సాగుతూ ప్రజాభిమానం చూరగొనాలని ఆకాంక్షిస్తున్నానని పేర్కొన్నారు.