ముంబయి వాంఖెడే స్టేడియం సిబ్బందికి కరోనా... ఐపీఎల్ ప్రత్యామ్నాయ వేదికల పరిశీలనలో హైదరాబాద్

03-04-2021 Sat 15:59
  • మహారాష్ట్రలో కరోనా తీవ్రం
  • ముంబయిలో భారీగా కేసులు
  • వాంఖెడే మైదానంలోనూ కరోనా కలకలం
  • 10 మంది సిబ్బందికి, ఆరుగురు ఈవెంట్ మేనేజర్లకు పాజిటివ్
Corona scare in Mumba Wankhede stadium

కరోనా ప్రభావంతో గతేడాది యూఏఈ గడ్డపై ఐపీఎల్ పోటీలు నిర్వహించిన బీసీసీఐ ఈ ఏడాది భారత్ లోనే లీగ్ ను నిర్వహించాలని నిర్ణయించింది. అయితే, ఐపీఎల్ 14వ సీజన్ ప్రారంభం (ఏప్రిల్ 9) మరికొన్ని రోజులుందనగా, ముంబయి వాంఖెడే స్టేడియం సిబ్బంది కరోనా బారినపడ్డారన్న వార్త ఐపీఎల్ వర్గాల్లో కలకలం రేపింది. దేశంలోనే అత్యధికంగా కరోనా కేసులు వస్తున్నది మహారాష్ట్రలోనే. అది కూడా ముంబయిలో కరోనా బీభత్సం సృష్టిస్తోంది.

ఈ నేపథ్యంలో, వాంఖెడే స్టేడియంలో 10 మంది సిబ్బందికి కరోనా పాజిటివ్ అని వెల్లడైంది. అంతేకాదు, ఐపీఎల్ పోటీల నిర్వహణ కోసం బీసీసీఐ నియమించిన ఆరుగురు ఈవెంట్ మేనేజర్లకు కూడా కరోనా సోకింది. కరోనా సోకిన వారందరినీ ఇళ్లకు పంపించి వేసి, వారి స్థానంలో కొత్త సిబ్బందిని తీసుకువచ్చారు.

బీసీసీఐ మాత్రం ముంబయిలో ఐపీఎల్ పోటీలు నిర్వహించడంపై ధీమాతో ఉంది. ఆటగాళ్లందరూ బయో బబుల్ లో ఉన్నారని, పైగా ప్రేక్షకులు లేకుండా నిర్వహిస్తున్నందున ఏమంత ఇబ్బందికరం కాదని బోర్డు చెబుతోంది. తమ వద్ద కావాల్సినంత మంది సిబ్బంది సిద్ధంగా ఉన్నారని అంటోంది. ఒకవేళ ఏదైనా సమస్య వచ్చి పరిస్థితి చేయి దాటిపోతే ప్రత్యామ్నాయ వేదికలుగా హైదరాబాద్, ఇండోర్ నగరాలు ఉండనే ఉన్నాయని బీసీసీఐకి చెందిన ఓ అధికారి తెలిపారు.