‘పంచాయతీ’ బరిలో మాజీ మిస్​ ఇండియా రన్నరప్​

03-04-2021 Sat 13:41
  • యూపీలోని బక్షా నుంచి పోటీ చేయనున్న దీక్షా సింగ్
  • జిల్లా అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండడమే కారణం
  • మూడో తరగతి దాకా అక్కడే చదువుకున్నానన్న దీక్ష
Model Diksha Singh set to contest UP panchayat polls

2015లో కొద్దిలో ఆమె మిస్ ఇండియా కిరీటాన్ని చేజార్చుకుంది. రన్నరప్ తో సరిపెట్టుకుంది. ఈసారి ఎలాగైనా గెలవాలన్న పట్టుదలతో ఉందామె. అయితే, అది మిస్ ఇండియా పోటీలనుకుంటే పొరపాటే. ఈసారి ఆమె బరిలోకి దిగబోతున్నది పంచాయతీ ఎన్నికల్లో. అవును, ఉత్తర్ ప్రదేశ్ లో త్వరలో పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికల్లో 2015 మిస్ ఇండియా రన్నరప్ దీక్షా సింగ్ బరిలో దిగుతున్నట్టు ప్రకటించారు.

జౌన్ పూర్ జిల్లాలోని బక్షా తాలూకాలో ఉన్న చిత్తోరి ఆమె స్వస్థలం. ఇప్పుడు బక్షాలోని వార్డ్ నంబర్ 26 నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని దీక్ష చెప్పారు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు జిల్లా పంచాయతీ సభ్యుడి నుంచి దరఖాస్తును కూడా తెచ్చుకున్నానని చెప్పారు.

తాను మూడో తరగతి వరకు చిత్తోరిలోనే చదువుకున్నానని, అయితే, తన తండ్రికి బదిలీ కావడంతో గోవా, అక్కడి నుంచి ముంబైకి వెళ్లిపోయామని ఆమె తెలిపారు. తన కళాశాల రోజుల నుంచే ఎన్నెన్నో రాజకీయ చర్చలు, పోటీల్లో పాల్గొన్నానని చెప్పారు. అప్పుడప్పుడూ ఊరికి వచ్చి వెళ్తుండేదాన్నని అన్నారు. అయితే, జౌన్ పూర్ జిల్లా అభివృద్ధికి ఆమడ దూరంలో ఉందని, అది చూసి చాలా బాధేసిందని దీక్ష అన్నారు. అందుకే పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు నిర్ణయించుకున్నానని వెల్లడించారు.

కాగా, ఆమె తండ్రి జితేంద్ర సింగ్ కు గోవా, రాజస్థాన్ లలో వ్యాపారాలున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో దీక్ష ‘రబ్బా మెహర్ కరే’ ఆల్బమ్ ను విడుదల చేసింది. ‘ఇష్క్ తేరా’ అనే సినిమా కథనూ రచించినట్టు ఆమె చెప్పింది.