South Africa: ఈ చేపలు సైనేడ్ కన్నా విషపూరితం!

  • దక్షిణాఫ్రికా బీచ్ లో వందలాదిగా చచ్చిపోయిన పఫర్ ఫిష్
  • టెట్రొడోటాక్సిన్ అనే విషంతో క్షణాల్లోనే మరణం
  • ప్రజలెవరూ బీచ్ వైపు వెళ్లొద్దని హెచ్చరిక
Hundreds Of Sea Creatures Deadlier Than Cyanide Found Washed Up On Beach

రత్నగర్భ అని సంద్రాలకు పేరు. విలువైన రాళ్లు, వైఢూర్యాలు, నిధి సంపదకు అవి నెలవు. అవే కాదు.. అందమైన ప్రాణులకూ ఆలవాలం. ఆ అందం చాటునే ప్రాణం తోడేసే ప్రమాదమూ పొంచి ఉంటుంది. అలాంటివే ఈ చేపలు. నోట్లో వేసుకుని రుచి చెప్పే లోపే చంపేస్తుందంటారు సైనేడ్ గురించి తెలిసినవాళ్లు. అయితే, ఆ సైనేడ్ కన్నా విషపూరితమీ చేపలు అంటున్నారు శాస్త్రవేత్తలు.

అవును, దక్షిణాఫ్రికాలోని కేప్ టౌన్ లో సముద్రపు ఒడ్డుకు ఆ చేపలు కొట్టుకువచ్చాయి. చచ్చి పడిపోయాయి. ఇటీవల తన కుటుంబంతో కలిసి అక్కడకు వెళ్లిన బ్రిటన్ శాస్త్రవేత్త డాక్టర్ టెస్ గ్రిడ్లీకి ఆ చేపలు కనిపించాయి. వాటిని చూసిన ఆమె వెంటనే అధికారులకు సమాచారమిచ్చారు. వాటిని పరిశీలించిన దక్షిణాఫ్రికా పర్యావరణ, అటవీ శాఖ నిపుణులు.. అవి అత్యంత విషపూరితమైన రాక్షసి కళ్ల ‘పఫర్ ఫిష్’ అని గుర్తించారు.


ఫాల్స్ బేలో కుప్పలుతెప్పలుగా పడి ఉన్న ఆ చేపలు.. సైనేడ్ కన్నా విషపూరితమైనవని హెచ్చరించారు. ఆ చేపల్లోని ‘టెట్రొడోటాక్సిన్’ అనే నరాల సంబంధిత విషం.. క్షణాల్లోనే ప్రాణాలను హరించి వేస్తుందని చెప్పారు. దాంతో ఛాతీ, పొట్టను వేరు చేసే ఊపిరితిత్తుల వద్ద ఉండే కండరం దెబ్బతింటుందని చెబుతున్నారు. స్థానికులెవరూ ఆ బీచ్ వద్దకు వెళ్లొద్దని, ఆ చేపలను ముట్టుకోవద్దని, తినకూడదని అధికారులు హెచ్చరించారు.

ఇప్పటికే ఆ పఫర్ ఫిష్ ను తిని ఓ కుక్క చనిపోయిందని ఆఫ్రి ఓషన్స్ కన్జర్వేషన్ అలయన్స్ అనే స్వచ్ఛంద సంస్థ వెల్లడించింది. సీ సెర్చ్ ఆర్గనైజేషన్ తరఫున సముద్ర జీవాలపై పరిశోధనలు చేస్తున్న టెస్ గ్రిడ్లీ.. బీచ్ లో పడి ఉన్న ఆ చేపల వీడియోను యూట్యూబ్ లో పోస్ట్ చేశారు. కాగా, కిలోమీటర్ కు 300 నుంచి 400 దాకా చేపలు చచ్చిపోయి పడి ఉన్నట్టు చెబుతున్నారు.

More Telugu News