udayanidhi: జైట్లీ, సుష్మ స్వ‌రాజ్‌పై స్టాలిన్ కొడుకు ఉద‌య‌నిధి వ్యాఖ్య‌లు.. ఈసీకి బీజేపీ ఫిర్యాదు

  • సుష్మ, జైట్లీల‌పై మోదీ ఒత్తిడి అన్న ఉద‌య‌నిధి
  • అందుకే  చనిపోయారని వ్యాఖ్య‌లు
  • మండిప‌డ్డ బీజేపీ నేత‌లు
bjp complaints against udayanidhi

ప్ర‌ధాని అయ్యేందుకు న‌రేంద్ర‌ మోదీ బీజేపీలోని చాలా మంది సీనియ‌ర్ల‌ను ప‌క్క‌నబెట్టారని డీఎంకే పార్టీ అధినేత‌‌ స్టాలిన్‌ కుమారుడు ఉద‌య‌నిధి ప‌లు వ్యాఖ్య‌లు చేసిన విష‌యం తెలిసిందే. బీజేపీ సీనియ‌ర్ నేత ఎల్‌కే అద్వానీకి ప్ర‌ధాని అయ్యే అర్హ‌త ఉన్నందుకే ఆయ‌న‌ను మోదీ దూరం పెట్టార‌ని, అలాగే, మోదీ వేధింపులు భ‌రించ‌లేకే య‌శ్వంత్ సిన్హా బీజేపీని వీడారని ఆయ‌న చెప్పారు.

అంతేగాక‌, త‌న ప‌ద‌వికి ఎలాంటి ప్ర‌మాదం రాకూడదనే ఉద్దేశంతోనే వెంక‌య్య నాయుడిని కూడా మోదీ ప‌క్క‌న‌పెట్టార‌ని ఆయ‌న ఇటీవ‌ల ఆరోపిస్తూ దివంగ‌త నేత‌లు జైట్లీ, సుష్మ స్వ‌రాజ్‌ల పేర్ల‌ను తీసుకొచ్చి విమ‌ర్శ‌లు గుప్పించారు. మోదీ ఒత్తిడి తట్టుకోలేకపోవడంతో సుష్మ, జైట్లీ చనిపోయారని ఉదయనిధి అన్నారు. త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌ల ప్ర‌చారంలో పాల్గొన్న సంద‌ర్భంగా ఇటీవ‌ల ఆయ‌న ఈ వ్యాఖ్య‌లు చేశారు.

దీంతో ఆయ‌న వ్యాఖ్య‌ల‌ను త‌ప్పుబ‌డతూ బీజేపీ ఈసీకి ఫిర్యాదు చేసింది. త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఉదయనిధిని అనర్హుడిగా ప్రకటించాలని కోరింది. అలాగే, డీఎంకే స్టార్ క్యాంప‌యిన‌ర్‌ల జాబితా నుంచి ఆయన పేరును తొలగించాలని విజ్ఞ‌ప్తి చేసింది.
 
మ‌రోవైపు, ఉద‌య‌నిధి వ్యాఖ్యలపై సుష్మ స్వ‌రాజ్‌ కూతురు బాన్సురీతో పాటు జైట్లీ కూతురు సొనాలీ స్పందిస్తూ ఇటువంటి వ్యాఖ్య‌లు స‌రికాద‌ని చెప్పారు. ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసం తమ తల్లి పేరును వాడకూడ‌ద‌ని సుష్మ స్వ‌రాజ్‌ కూతురు బాన్సురీ చెప్పారు. త‌న త‌ల్లి అంటే మోదీకి అమిత గౌరవమని ఆమె అన్నారు. మోదీతో త‌న తండ్రి అరుణ్ జైట్లీకి ప్రత్యేక అనుబంధం ఉండేదని సొనాలీ జైట్లీ  వ్యాఖ్యానించారు.

More Telugu News