క్రేజీ ప్రాజెక్టులో ఛాన్స్ కొట్టేసిన రాశి ఖన్నా!

03-04-2021 Sat 10:53
  • విక్రమ్ కుమార్ తాజా చిత్రంగా 'థ్యాంక్యూ'
  • కథానాయకుడిగా నాగచైతన్య
  • నిర్మాతగా 'దిల్' రాజు    
Rashi Khanna in Vikram Kumar Movie

తెలుగు తెరపై తెల్లమందారంలా మెరిసే కథానాయిక రాశి ఖన్నా. ముద్దుగా .. బొద్దుగా .. ముద్దబంతి పువ్వులా కనిపించే రాశి ఖన్నాకి యూత్ లో చాలా ఫాలోయింగ్ ఉంది. నిజానికి కెరియర్ ఆరంభంలో ఆమెకి వచ్చిన క్రేజ్ కి .. నాన్ స్టాప్ గా టాలీవుడ్ ను దున్నేస్తుందని అంతా అనుకున్నారు.

కానీ అలా జరగలేదు .. నిదానమే ప్రధానం అనుకుంటూ నింపాదిగా కూర్చుంది. దాంతో తన తరువాత వచ్చినవారిని కూడా తను అందుకోలేకపోయింది. పద్ధతిగా కనిపిస్తే పట్టించుకోరనే విషయం అర్థమై, అందాలు ఆరబోయాలనుకునేసరికి ఆలస్యమైపోయింది. దాంతో ఆమె కోలీవుడ్ పై ఎక్కువగా ఫోకస్ పెట్టింది. ప్రస్తుతం ఆమె చేతిలో నాలుగు తమిళ సినిమాలు ఉన్నాయి.

తెలుగులో రాశి ఖన్నా ఒక సినిమాకి మాత్రమే సైన్ చేసినట్టు తెలుస్తోంది. అదే మారుతి సినిమా .. దాని పేరే 'పక్కా కమర్షియల్'. గోపీచంద్ హీరోగా ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమా తరువాత ఆమె మరో సినిమా కూడా అంగీకరించినట్టుగా తెలుస్తోంది. అదీ .. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో.  అవును, విక్రమ్ కుమార్ దర్శకత్వంలో 'థ్యాంక్యూ'  సినిమా రూపొందుతోంది. నాగచైతన్య కథానాయకుడిగా 'దిల్' రాజు బ్యానర్లో నిర్మితమవుతున్న ఈ సినిమా, ఆల్రెడీ షూటింగు జరుపుకుంటోంది. ఈ సినిమాలో కథానాయికగా రాశి ఖన్నాను తీసుకున్నట్టుగా సమాచారం. త్వరలోనే ఆమె పేరును అధికారికంగా ప్రకటిస్తారని అంటున్నారు.