'కలర్ ఫొటో' డైరెక్టర్ తో చేసే స్టార్ హీరో ఎవరబ్బా?

03-04-2021 Sat 10:18

  • 'కలర్ ఫొటో'తో దక్కిన సక్సెస్
  • గీతా ఆర్ట్స్ నుంచి భారీ ఆఫర్
  • పట్టాలెక్కనున్న ప్రాజెక్ట్  
Colour Photo director is doing the movie with geetha arts

ఒకప్పుడు కొత్త దర్శకులకు అవకాశాలు రావడానికి చాలా సమయం పట్టేది. సీనియర్ దర్శకుల దగ్గర ఏళ్లతరబడి అనుభవం సంపాదిస్తేనే తప్ప అవకాశాలు వచ్చేవి కాదు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. ఒక్క షార్ట్ ఫిల్మ్ తీసేసి .. సినిమా ఛాన్స్ పట్టేస్తున్నారు. నిజంగా ఇది చాలా శుభపరిణామం. ఇలా కొత్త దర్శకులను ప్రోత్సహించడంలో పెద్ద బ్యానర్లు సైతం ఉత్సాహాన్ని చూపుతుండటం విశేషం.

ముఖ్యంగా గీతా ఆర్ట్స్ వారు వరుసగా కొత్త దర్శకులకు అవకాశాలు ఇస్తూ వస్తున్నారు. ఆ బ్యానర్లో సినిమా చేయాలనే ఆశ .. ఆసక్తి కొత్తగా ఇండస్ట్రీకి వచ్చిన ప్రతి దర్శకుడికి ఉంటుంది. తాజాగా ఆ బ్యానర్లో వర్ధమాన దర్శకుడు సందీప్ రాజ్ అవకాశం దక్కించుకున్నాడు.


ఇటీవల ఓటీటీలో విడుదలై మంచి ఆదరణ పొందిన చిత్రాలలో 'కలర్ ఫొటో' ఒకటి. సుహాస్ - చాందినీ చౌదరి జంటగా నటించిన ఈ సినిమాకి సందీప్ రాజ్ దర్శకత్వం వహించాడు. కథ .. స్క్రీన్ ప్లే .. సంభాషణలపై కూడా ఆయనకి మంచి అనుభవం ఉంది. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన  'కలర్ ఫొటో' .. యూత్ ను ఒక రేంజ్ లో ఆకట్టుకుంది.

ఆ సినిమా చూసిన గీతా ఆర్ట్స్ వారు, తమ బ్యానర్లో ఒక సినిమా చేయమని సందీప్ రాజ్ కి అడ్వాన్స్ ఇచ్చారట. అయితే ఈ సినిమా ఒక మీడియం రేంజ్ హీరోతో ఉండవచ్చని అనుకున్నారు. కానీ ఒక స్టార్ హీరోతో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందనేది తాజా సమాచారం. ఆ స్టార్ హీరో ఎవరనేది త్వరలోనే తెలిసే అవకాశం ఉంది.