రెండో వారం నుంచి దేశంలో చెలరేగిపోనున్న కరోనా మహమ్మారి: శాస్త్రవేత్తల హెచ్చరిక

03-04-2021 Sat 08:04
  • ఏప్రిల్ 15-20 మధ్య కేసుల సంఖ్య గరిష్ఠ స్థాయికి
  • మే తర్వాత క్రమంగా తగ్గుముఖం
  • ఐఐటీ కాన్పూర్ శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడి
COVID Second Wave In India May Peak By Mid April

ఈ నెల రెండో వారం తర్వాత దేశంలో కరోనా వైరస్ విజృంభణ గరిష్ఠ స్థాయికి చేరుతుందని ఐఐటీ కాన్పూర్ శాస్త్రవేత్తలు అంచనా వేశారు. మే చివరి వరకు అలానే కొనసాగి ఆ తర్వాత క్రమంగా తీవ్రత తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని పేర్కొన్నారు. గతేడాది సెప్టెంబరులో వైరస్ గరిష్ఠ స్థాయికి చేరుకుని ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి తగ్గిందని, ప్రస్తుతం రెండో దశలోనూ వైరస్ ఉద్ధృతి అలానే ఉండే అవకాశం ఉందని అంచనా వేశారు.

దేశంలో ప్రస్తుతం కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న తీరును చూస్తే ఈ నెల 15-20 మధ్య గరిష్ఠ స్థాయికి చేరుకోవచ్చని ఐఐటీ కాన్పూర్ శాస్త్రవేత్త మనీంద్రా అగర్వాల్ తెలిపారు. ప్రస్తుతం రోజువారీగా నమోదవుతున్న కేసుల సంఖ్య లక్షకు చేరువలో ఉందని, మున్ముందు ఆ సంఖ్య మరింత పెరుగుతుందని పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితిని బట్టి మహారాష్ట్ర, పంజాబ్‌లలో కేసులు గరిష్ఠానికి చేరుకుంటాయని తెలిపారు.

 కాగా, హర్యానాలోని అశోకా యూనివర్సిటీకి చెందిన గౌతమ్ మీనన్ మాత్రం ఏప్రిల్, మే నాటికి వైరస్ విజృంభణ తీవ్రస్థాయికి చేరుకుంటుందని అంచనా వేశారు. వైరస్ వ్యాప్తి రేటు, అది సోకే అవకాశం ఉన్న జనాభా, పాజిటివ్ కేసుల సంఖ్యను ఆధారంగా చేసుకుని శాస్త్రవేత్తలు ఈ అంచనాకొచ్చారు.