ఎన్నికల వేళ అసోంలో బీజేపీకి ఎదురుదెబ్బ!

02-04-2021 Fri 22:32
  • పార్టీ కీలక నేత హిమంత శర్మపై ఈసీ నిషేధం
  • రెండు రోజుల పాటు పార్టీ ప్రచారానికి దూరం
  • హంగ్రామాని జైలుకి పంపుతామని హెచ్చరించడమే కారణం
  • హిమంత ఇచ్చిన సమాధానంతో సంతృప్తి చెందని ఈసీ
Ban on Himantha Biswa Sarmas Campaign by EC For threatening of jail

అసెంబ్లీ ఎన్నికలు కొనసాగుతున్న అసోంలో బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. ఆ రాష్ట్రంలో పార్టీ కీలక నేత, ప్రచార తార(స్టార్‌ క్యాంపెయినర్‌)గా ఉన్న హిమంత విశ్వ శర్మపై ఎన్నికల సంఘం రెండురోజుల పాటు వేటు వేసింది. ఆయన ప్రచారంలో పాల్గొనడంపై నిషేధం విధించింది. ఈ మేరకు ఆయనకు శుక్రవారం నోటీసులు జారీ చేసింది. ఈ ఆదేశాలు శుక్రవారం రాత్రి నుంచే అమల్లోకి రానున్నాయని స్పష్టం చేసింది.

హిమంత విశ్వ శర్మ ఇటీవల జరిగిన ఓ సభలో మాట్లాడుతూ.. బోడోలాండ్‌ నేత హంగ్రామా మొహిలరీకి జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు. కోక్రాజర్‌లో పోలీసులు స్వాధీనం చేసుకున్న ఆయుధాల కేసుని ఎన్ఐ‌ఏకి అప్పగించామని తెలిపారు. హంగ్రామా సహా బోడోలాండ్‌ ప్రాంతంలో అలజడులు సృష్టించడాన్ని సహించబోమని వ్యాఖ్యానించారు.

ఇది జరిగిన రెండు రోజుల తర్వాత శర్మపై కాంగ్రెస్‌ నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. మొహిలరీని జైలుకు పంపుతామని బహిరంగంగా బెదిరించారని తెలిపారు. ఈ నేపథ్యంలో వెంటనే ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు. దీన్ని పరిశీలించిన ఎన్నికల సంఘం శర్మకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఆయన ఇచ్చిన సమాధానంతో సంతృప్తి చెందని ఎన్నికల సంఘం రెండు రోజుల నిషేధం విధించాలని నిర్ణయించింది.

126 స్థానాలున్న అసోంలో మార్చి 27న తొలి విడత, ఏప్రిల్‌ 1న రెండో విడత పోలింగ్‌ పూర్తయింది. ఏప్రిల్ 6న మూడో దశ పోలింగ్‌ జరగనుండగా.. మే 2న ఫలితాలు వెలువడతాయి.