తమ ప్రత్యర్థుల తరఫున ప్రచారం చేయాలంటూ ప్రధాని మోదీని కోరుతున్న డీఎంకే అభ్యర్థులు... ఎందుకంటే..!

02-04-2021 Fri 22:22
  • తమిళనాడులో ఏప్రిల్ 6న అసెంబ్లీ ఎన్నికలు
  • ఉద్ధృతంగా ప్రచారం చేస్తున్న ఆయా పార్టీల నేతలు 
  • తమ గెలుపు మార్జిన్ పెరుగుతుందని నమ్మిక
DMK candidates wants PM Modi should campaign for their rivals

తమిళనాడులో ఈసారి గెలుపు ఎవరిని వరిస్తుందన్నది చెప్పడం రాజకీయ విశ్లేషకులకు కూడా కాస్త కష్టంగానే ఉంది. దక్షిణాది రాష్ట్రాల్లో చొచ్చుకు వెళ్లేందుకు బీజేపీ బలంగా యత్నిస్తుండడం, కమలహాసన్ మక్కళ్ నీది మయ్యం పార్టీ అసెంబ్లీ ఎన్నికల బరిలో తొలిసారిగా దిగుతుండడం తమిళనాడు రాజకీయాలపై ప్రభావం చూపుతాయని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

 ఆ విషయం అటుంచితే ఎవరికి వారే ప్రచారాన్ని తీవ్రస్థాయిలో ముందుకు తీసుకెళుతున్నారు. అయితే, డీఎంకే అభ్యర్థులు సోషల్ మీడియా ద్వారా ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తులు చేస్తుండడం ఆసక్తి కలిగిస్తోంది.

అదేంటంటే... అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తమ ప్రత్యర్థుల తరఫున ప్రచారానికి రావాలంటూ వారు మోదీని కోరుతున్నారు. బీజేపీ లేక, అన్నాడీఎంకే అభ్యర్థుల తరఫున మోదీ ప్రచారానికి వస్తే, తమ రేంజి మరింత పెరిగిపోతుందన్నది డీఎంకే అభ్యర్థుల భావన. మోదీ ప్రచారం చేసిన నియోజకవర్గం కాబట్టి తమ గెలుపు మార్జిన్ కూడా ఆ స్థాయిలో ఘనంగా ఉంటుందని వారు నమ్ముతున్నారు.

 ఈ మేరకు కుంభమ్ నియోజకవర్గం బరిలో ఉన్న డీఎంకే అభ్యర్థి ఎన్.రామకృష్ణన్ ట్విట్టర్ లో ప్రధాని మోదీని అర్థించారు. డీఎంకే సీనియర్ నేత, ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఈవీ వేలు, సెల్వరాజ్, తదంగం పి సుబ్రమణి, అనితా రాధాకృష్ణన్, అంబేత్ కుమార్ తదితరులు కూడా ఇదే తరహాలో మోదీని కోరడం విశేషం.

కార్తికేయ శివసేనాపతి అనే డీఎంకే అభ్యర్థి కూడా... తన ప్రత్యర్థి, తమిళనాడు మంత్రి ఎస్పీ వేలుమణి తరఫున ప్రచారం చేయాలంటూ ప్రధాని మోదీని ఆహ్వానించారు. ప్రధాని నరేంద్ర మోదీ గురువారం నాడు తమిళనాడులోని మధురై, కన్యాకుమారి ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. తమిళనాడులో ఏప్రిల్ 6న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.