కరోనాను కూడా నువ్వు సిక్స్ కొట్టేస్తావు... సచిన్ కు వసీం అక్రమ్ సందేశం

02-04-2021 Fri 22:05
  • సచిన్ కు కరోనా
  • డాక్టర్ల సలహాతో ఆసుపత్రిలో చేరిక
  • 16 ఏళ్ల వయసులోనే మేటి బౌలర్లను ఎదుర్కొన్నావన్న అక్రమ్
  • కరోనాను కూడా అలాగే ఎదుర్కోవాలని పిలుపు
Wasim Akram wishes Sachin Tendulker a speedy recovery

భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ఆయనకు ఇటీవల కరోనా పాజిటివ్ అని తేలగా, వైద్యుల సలహా మేరకు నేడు ఆసుపత్రిలో చేరారు. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ పేస్ లెజెండ్ వసీం అక్రమ్ స్పందించారు. సచిన్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కరోనా వైరస్ ను కూడా సచిన్ సిక్సర్ కొట్టాలని చమత్కరించారు. ఈ మేరకు ట్విట్టర్ లో తన సందేశాన్ని పోస్టు చేశారు.

"16 ఏళ్ల వయసులో తొలి టెస్టు ఆడుతూ ప్రపంచ మేటి బౌలర్లను ఎంతో తెగువతో ఎదుర్కొన్నావు. ఇప్పుడీ కరోనాను కూడా సిక్సర్ బాదేస్తావని అనుకుంటున్నా. త్వరగా కోలుకో మాస్టర్. ప్రస్తుతం ఆసుపత్రిలో ఉన్నావు కాబట్టి అక్కడి స్టాఫ్, డాక్టర్లతో కలిసి 2011 వరల్డ్ కప్ వార్షికోత్సవ వేడుకలు జరుపుకుని నాకో ఫొటో పంపించు" అని పేర్కొన్నారు. 2011 వరల్డ్ కప్ ను టీమిండియా గెలిచి పదేళ్లయిన సందర్భంగా భారత క్రికెట్ వర్గాలు వేడుకలు జరుపుకుంటున్న సంగతి తెలిసిందే.