తన సిబ్బందిని, మీడియా ప్రతినిధులను 'ఏప్రిల్ ఫూల్' చేసిన అమెరికా ప్రథమ మహిళ జిల్ బైడెన్

02-04-2021 Fri 21:49
  • ఏప్రిల్ 1న జిల్ బైడెన్ చమత్కారం
  • కాలిఫోర్నియా నుంచి వాషింగ్టన్ తిరిగొస్తుండగా ఘటన
  • ఎయిర్ హోస్టెస్ లా మారిపోయిన జిల్
  • అందరికీ ఐస్ క్రీమ్ ల పంపిణీ
  • ఒక్కసారిగా విగ్గు తీసేయడంతో అందరూ అవాక్కు
US First Lady Jill Biden April Fools her staff and media

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అర్ధాంగి, దేశ ప్రథమ మహిళ జిల్ బైడెన్ ఎంతో చమత్కారి. ఏప్రిల్ 1 సందర్భంగా ఆమె అందరినీ ఏప్రిల్ ఫూల్ చేశారు. ఆమె కాలిఫోర్నియా పర్యటన ముగించుకుని వాషింగ్టన్ తిరిగి వస్తుండగా ఓ ఎయిర్ హోస్టెస్ లా మారిపోయారు. తలపై విగ్గు, ముఖానికి నల్లని మాస్కు ధరించి, ఫ్లయిట్ అటెండెంట్ దుస్తులు వేసుకుని ఏమాత్రం గుర్తుపట్టలేనంతగా తయారయ్యారు. పైగా 'జాస్మిన్' అనే పేరున్న బ్యాడ్జి ధరించారు. దాంతో ఆమెను ఆ విమానంలో ఉన్న వ్యక్తిగత సిబ్బంది, మీడియా ప్రతినిధులు విమాన సిబ్బందిలో ఒకరిగానే భావించారు.

ఆ తర్వాత జిల్ బైడెన్ విమానంలోని అందరికీ ఐస్ క్రీమ్ బార్లు అందించారు. ఇంతలో జిల్ బైడెన్ ఒక్కసారిగా విగ్గు తీసేసి ఏప్రిల్ ఫూల్స్ అనడంలో అందరూ అవాక్కయ్యారు. తాము ఎయిర్ హోస్టెస్ గా  భావించింది అమెరికా ప్రథమ పౌరురాలినా అని ఆశ్చర్యపోయారు. గతంలో ఆమె సాక్షాత్తు భర్త, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ను కూడా ఆటపట్టించారట. ఓ ప్రయాణంలో ఎయిర్ ఫోర్స్ టు విమానంలో ముందే ఎక్కిన జిల్ ఓ పెట్టెలో దాక్కుని, బైడెన్ ఎక్కగానే ఒక్కసారి "బూ" అంటూ భయపెట్టే ప్రయత్నం చేసినట్టు అమెరికా మీడియా వెల్లడించింది.