Rajastjani: ఇదొక పాత ఖండాంతర ప్రేమకథ... 50 ఏళ్ల తర్వాత ప్రేమికుడికి ఫోన్ చేసిన ప్రేయసి!

  • రాజస్థాన్ లోని కుల్దారా గ్రామానికి ప్రత్యేకత
  • దయ్యాల గ్రామంగా గుర్తింపు
  • ఆ గ్రామానికి కాపలాదారుగా వ్యవహరిస్తున్న వ్యక్తి
  • 1970లో గ్రామాన్ని సందర్శించిన ఆస్ట్రేలియా యువతి
  • ఆ యువతితో ప్రేమలో పడిన కాపలాదారు
Age old love story of Indian man and Australian woman

ప్రేమ గుడ్డిదని, హద్దులు ఎరుగదని ఊరికే చెప్పలేదు. ఈ దశాబ్దాల నాటి ప్రేమకథే అందుకు నిదర్శనం. అసలీ ఖండాంతర ప్రేమకథ లోతుల్లోకి వెళ్లాలంటే రాజస్థాన్ లోని ఓ దయ్యాల గ్రామం గురించి తెలుసుకోవాలి. జైసల్మేర్ జిల్లాలో ఉండే కుల్దారా గ్రామం 13వ శతాబ్దం నుంచి చరిత్ర పుటల్లో చోటు దక్కించుకుంది. అయితే గ్రామంలో ఆత్మలు సంచరిస్తున్నాయన్న భయంతో ఊరు ఊరంతా ఇళ్లు ఖాళీ చేసి అక్కడ్నించి తరలిపోయింది. దాంతో ఆ ఊళ్లో శ్మశాన నిశ్శబ్దం ఆవరించింది. అయితే ఆ గ్రామానికి ద్వారపాలకుడిగా వ్యవహరించిన 82 ఏళ్ల ఓ వృద్ధుడి ప్రేమకథనే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం.

బాంబే హ్యూమన్స్ అనే సోషల్ మీడియా సైట్ కు ఆ వృద్ధుడు తన ప్రేమగాథను వివరించాడు. 1970లో కుల్దారా గ్రామాన్ని సందర్శించేందుకు ఆస్ట్రేలియా నుంచి మెరీనా అనే యువతి వచ్చింది. జైసల్మేర్ లో ఐదు రోజుల యాత్రకు వచ్చిన ఆమెను చూసి తొలి చూపులోనే వలచాడు. ఆ ఆస్ట్రేలియా అమ్మాయి కూడా అతడిపై మనసు పడింది. ఆ పర్యటన యావత్తు ఇద్దరూ ఒకర్ని విడిచి మరొకరు ఉండలేకపోయారు. అయితే ఆమె ఆస్ట్రేలియా తిరిగి వెళుతూ ఐ లవ్యూ అని చెప్పడంతో ఆ కుర్రాడు సిగ్గుతో మెలికలు తిరిగిపోయాడు.

గతంలో తనతో ఎవరూ అంత సన్నిహితంగా మెలగకపోగా, ఆమె ప్రేమ ప్రతిపాదనతో మనవాడికి మతిపోయినంత పనైంది. బదులుగా ఒక్క మాట కూడా మాట్లాడేకపోయాడట. ఆ తర్వాత మెరీనా ఆస్ట్రేలియా వెళ్లిపోయినా, ఇద్దరి మధ్య ఉత్తరప్రత్యుత్తరాలు నడిచాయి. ప్రేమావేశంలో ఓసారి రూ.30 వేలు అప్పు తీసుకుని ఇంట్లో చెప్పకుండా ఆస్ట్రేలియా వెళ్లి అక్కడే 3 నెలలు ఉన్నాడు.

ఆ మూడు నెలలు అద్భుతంగా గడిచాయని, ఆమె తనకు ఇంగ్లీషు నేర్పిస్తే, తాను ఆమెకు ఘూమర్ నృత్యాన్ని నేర్పించానని అతడు గుర్తు చేసుకున్నాడు. కాగా, పెళ్లి విషయంలో తమ మధ్య ఏకాభిప్రాయం కుదరలేదని, పెళ్లి చేసుకుని ఆస్ట్రేలియాలో ఉండిపోదామని ఆమె చెప్పిందని, కానీ రాజస్థాన్ లోని తన కుటుంబాన్ని వదల్లేక పోయానని అతడు పేర్కొన్నాడు. మెరీనా భారత్ వచ్చేందుకు అంగీకరించకపోవడంతో తాను స్వదేశానికి వచ్చేశానని, తల్లిదండ్రుల ఒత్తిడితో పెళ్లి చేసుకుని కుల్దారా గ్రామం వద్ద ద్వారపాలకుడిగా ఉద్యోగంలో చేరానని వెల్లడించాడు.

అయితే మెరీనా కూడా పెళ్లి చేసుకుందా? అని తరచుగా అనుకునేవాడ్నని, అసలు ఆమెను మళ్లీ చూస్తానా? అని భావించేవాడ్నని తన మనోభావాలను పంచుకున్నాడు. కాలక్రమంలో ఆమె జ్ఞాపకాలు మసకబారిపోయాయని, తన పిల్లలు పెద్దవాళ్లయ్యారని, రెండేళ్ల కిందట భార్య కాలం చేసిందని వివరించాడు.

82 ఏళ్ల వయసులో అనూహ్యరీతిలో మెరీనా నుంచి వచ్చిన ఉత్తరం ఆశ్చర్యానికి గురిచేసిందని వెల్లడించాడు. 'ఎలా ఉన్నావు మై ఫ్రెండ్?' అంటూ లేఖలో అడిగిందని, 50 ఏళ్ల తర్వాత ఆమె తనను కనుగొనడం మాటలకందని అనుభూతిని కలిగిస్తోందని తెలిపాడు. అప్పట్నించి ప్రతి రోజు ఫోన్ చేసి మాట్లాడుతోందని, తాము అనేక విషయాలు కలబోసుకుంటున్నామని సంతోషం వ్యక్తం చేశాడు.

మెరీనా అప్పటి నుంచి ఇప్పటివరకు పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉండిపోయిందని, త్వరలోనే భారత్ రానుందని వెల్లడించాడు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే మళ్లీ తాను కుర్రాడిలా మారిన ఫీలింగ్ కలుగుతోందని తెలిపాడు. మున్ముందు ఏం జరుగుతుందో చెప్పలేను కానీ, నా తొలిప్రేమ మళ్లీ నా జీవితంలోకి వస్తోంది అంటూ సంబరంగా చెప్పాడు.

More Telugu News