మెక్సికోలో విషాదం... అమ్మాయి పుట్టిందని విమానం ద్వారా తెలిపే ప్రయత్నంలో ఇద్దరి మృతి

02-04-2021 Fri 19:41
  • కాంకన్ సిటీలో ఓ దంపతులకు ఆడ శిశువు జననం
  • జెండర్ రివీల్ పార్టీ ఏర్పాటు 
  • చిన్న విమానాన్ని అద్దెకు తీసుకున్న వైనం
  • గులాబీ రంగు పొగ విడుదల
  • అమ్మాయి పుట్టిందన్న దానికి సంకేతం
  • ఆపై నీటిలో కుప్పకూలిన విమానం
Gender Reveal party turns a mishap

పాశ్చాత్య దేశాల్లో అమ్మాయి పుట్టిందన్న దానికి సంకేతంగా గులాబీ రంగును ప్రదర్శిస్తుంటారు. ప్రత్యేకంగా 'జెండర్ రివీల్' పార్టీలు ఏర్పాటు చేసి బంధుమిత్రులతో తమ సంతోషాన్ని పంచుకుంటారు. అయితే మెక్సికోలోని కాంకన్ నగరంలో ఓ దంపతులు తమకు అమ్మాయి పుట్టిందన్న విషయాన్ని ఓ చిన్న విమానం ద్వారా తెలిపే ప్రయత్నం చేశారు. అందుకోసం విమానాన్ని అద్దెకు తీసుకున్నారు.

ఆ విమానం గాల్లోకి లేచి పాప పుట్టింది అనే సంకేతాన్ని ఇస్తూ గులాబీ రంగు పొగను విడుదల చేసింది. కింద ఓ బోటులో ఉన్న ఆ దంపతుల బంధుమిత్రులందరూ అది చూసి కేరింతలు కొట్టారు. కానీ అంతలోనే  విమానం నీటిలో కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో విమాన పైలెట్, కోపైలెట్ ఇద్దరూ మరణించారు. బోటులో ఉన్న వారు ఈ ఘటనను తమ కెమెరాల్లో బంధించగా, ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.