'మాస్టర్'తో ఓకే చెప్పించుకున్న ప్రశాంత్ నీల్!

02-04-2021 Fri 18:54
  • సంచలన దర్శకుడిగా ప్రశాంత్ నీల్
  • సెట్స్ పై ప్రభాస్ హీరోగా 'సలార్'
  • నెక్స్ట్ మూవీ హీరోగా విజయ్
Vijay and Preshanth Neel Combination is gonig to be seen soon

ప్రశాంత్ నీల్ .. పరిచయమే అవసరం లేని పేరు. ఒకే ఒక్క సినిమాతో అగ్నిపర్వతం మాదిరిగా అందరి దృష్టిని ఆకర్షించాడు. అంతగా ఆయన వైవు అందరి దృష్టిపడేలా చేసిన సినిమా 'కేజీఎఫ్'.

దేశవ్యాప్తంగా ఈ సినిమా సృష్టించిన సంచలనం .. సాధించిన వసూళ్లను గురించి ఇంకా కొన్నాళ్లపాటు చెప్పుకుంటూనే ఉంటారు. ఒక సినిమాతో దర్శకుడు ఈ స్థాయిలో పాప్యులర్ కావడమనేది ఈ మధ్యకాలంలో జరగలేదు. ఇటు దక్షిణాదిన .. అటు ఉత్తరాదిన స్టార్ హీరోలు ఆయన దర్శకత్వంలో ఒక సినిమా చేయాలని ఉత్సాహం చూపడం కూడా ఇంతకుముందు ఈ స్థాయిలో జరగలేదు.

ఇక తనతో ఒక సినిమా చేయాలని ఎంతమంది స్టార్ హీరోలు ఆసక్తిని చూపుతున్నప్పటికీ, ప్రశాంత్ నీల్ మాత్రం పాన్ ఇండియా సత్తా కలిగిన హీరోలను మాత్రమే ఎంచుకుంటూ వెళుతున్నాడు. అలా తెలుగులో ఆయన ప్రభాస్ హీరోగా 'సలార్' సినిమా చేస్తున్నాడు. రఫ్ లుక్ తో ప్రభాస్ పోస్టర్ ను ఆవిష్కరించి ఆదిలోనే హండ్రెడ్ మార్కులు కొట్టేశాడు. ఒక వైపున ఆయన ఈ సినిమాను చక్కబెడుతూనే కోలీవుడ్ పై దృష్టిపెట్టాడు.

విజయ్ తో కూడా ఒక పాన్ ఇండియా మూవీ చేయాలనే ఆలోచనలో ఆయన ఉన్నాడనే టాక్ వచ్చింది. అయితే నిజమా? .. కాదా? అనే డౌటు అభిమానుల్లో ఉండిపోయింది. ఈ ఇద్దరి కాంబినేషన్లో ఒక సినిమా ఫిక్స్ అయ్యిందనే వార్త బాలీవుడ్ లోను .. కోలీవుడ్ లోను గుప్పుమంటోంది. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రకటన వెలువడనుందని అంటున్నారు. ఇదంతా చూస్తుంటే ప్రశాంత్ నీల్ స్పీడ్ మామూలుగా లేదనే విషయం అర్థమైపోవడం లేదూ!