చంద్రబాబు పరిషత్ ఎన్నికలకు భయపడుతున్నాడన్న విజయసాయి... వైసీపీ బాయ్ కాట్ల లిస్టుతో అచ్చెన్న కౌంటర్

02-04-2021 Fri 18:37
  • పరిషత్ ఎన్నికలను బహిష్కరించిన టీడీపీ
  • చంద్రబాబుపై విజయసాయి వ్యంగ్యం
  • దీటుగా స్పందించిన అచ్చెన్నాయుడు
  • పెద్ద పుడింగిలా బిల్డప్ ఇవ్వకు అంటూ వ్యాఖ్యలు
  • ఏళ్ల తరబడి తోక ముడుస్తున్నది మీరేనని ఎద్దేవా
War of words between YSRCP and TDP leaders

ఏపీలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో పోటీ చేయరాదని టీడీపీ నిర్ణయించడం పట్ల వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శలు చేశారు. చంద్రబాబు పరిషత్ ఎన్నికల్లో పోటీకి భయపడుతున్నాడని ఎద్దేవా చేశారు. వ్యాపారంలో నష్టమొచ్చి దుకాణం మూసేసే ముందు  మిగిలిన సరుకును 90 శాతం డిస్కౌంటుకు అమ్మేస్తుంటారని, అందుకు కూడా ఎవరూ ముందుకు రాకపోతే యజమాని ఫ్రీగా వదిలించుకుంటాడని వివరించారు. చంద్రబాబు పరిస్థితి ప్రస్తుతం అలాగే ఉందని, ప్రజాక్షేత్రంలో తిరస్కృతుడిగా మిగిలిపోయాడని విమర్శించారు.

అయితే, విజయసాయి వ్యాఖ్యలకు ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు దీటుగా బదులిచ్చారు. గతంలో వైసీపీ బాయ్ కాట్ చేసిన సందర్భాలను ఓ జాబితా రూపంలో వెల్లడించారు. మూడేళ్లు అసెంబ్లీని బాయ్ కాట్ చేసిన మీరు కూడా మాట్లాడేవాళ్లేనంటూ గట్టిగా కౌంటర్ ఇచ్చారు.

"2013లో ఎమ్మెల్సీ ఎన్నిక ఎందుకు బాయ్ కాట్ చేశావ్? 2013లో కొన్ని సహకార ఎన్నికలు ఎందుకు బాయ్ కాట్ చేశావ్? 2015లో ప్రకాశం జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నిక ఎందుకు బాయ్ కాట్ చేశావ్? 2018లో తెలంగాణ ఎన్నికలకు ఎందుకు తోక ముడిచావ్? 2020లో జీహెచ్ఎంసీ ఎన్నికలకు ఎందుకు తోక ముడిచావ్? తొమ్మిదేళ్ల నుంచి సీబీఐ ఎంక్వైరీని ఎందుకు బాయ్ కాట్ చేశావ్?" అంటూ అచ్చెన్నాయుడు ప్రశ్నలు సంధించారు.

"ఇన్ని బాయ్ కాట్ చేసిన నువ్వు పెద్ద పుడింగిలాగా బిల్డప్ ఇవ్వకు విజయసాయిరెడ్డీ ...అసహ్యంగా ఉంటుంది" అని వ్యాఖ్యానించారు.