సాగర్ ఉపఎన్నికలో భగత్ కొట్టే దెబ్బకు జానారెడ్డి అడ్రస్ లేకుండా పోతాడు: తలసాని

02-04-2021 Fri 18:08
  • సాగర్ బరిలో టీఆర్ఎస్ అభ్యర్థిగా నోముల భగత్
  • భగత్ కు మద్దతుగా తలసాని, జగదీశ్ రెడ్డి ప్రచారం 
  • భగత్ విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరన్న తలసాని
  • పోటీ నుంచి తప్పుకుని ఉంటే జానాపై గౌరవం పెరిగేదని వ్యాఖ్య 
Talasani campaigns for Nomula Bhagat in Nagarjuna Sagar constituency

నాగార్జునసాగర్ ఉప ఎన్నిక బరిలో రాజకీయ పార్టీలు హోరాహోరీ ప్రచారానికి తెరదీశాయి. అధికార టీఆర్ఎస్ తరఫున నోముల భగత్ పోటీ చేస్తుండగా, ఆయనకు మద్దతుగా ఇవాళ సాగర్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, జగదీశ్ రెడ్డి, ఇతర టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తలసాని శ్రీనివాస్ హాలియాలో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ, నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో విపక్షాల అడ్రస్ లు గల్లంతవడం ఖాయమని అన్నారు. టీఆర్ఎస్ ప్రభంజనం ముందు జానారెడ్డి అడ్రస్ లేకుండా పోతాడని వ్యాఖ్యానించారు. సాగర్ లో నోముల భగత్ విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరని స్పష్టం చేశారు.

"సాగర్ బరిలో విపక్షాలకు పుట్టగతులుండవు. ఏడు పర్యాయాలు గెలిచిన జానారెడ్డి తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో తాను మాత్రమే ఎదిగారు తప్ప ప్రజలు ఎదగలేదు. టీఆర్ఎస్ అభ్యర్థిగా నోముల భగత్ పేరును ప్రకటించిన వెంటనే పోటీ నుంచి తప్పుకుని ఉంటే జానారెడ్డి పట్ల ఎంతో గౌరవం కలిగేది. అయితే భగత్ కొట్టే దెబ్బకు ఇక నాగార్జునసాగర్ నియోజకవర్గాన్ని జానారెడ్డి శాశ్వతంగా మర్చిపోతాడు" అని తలసాని వ్యాఖ్యానించారు.