ఏపీలో కరోనా కేసుల సంఖ్య పైపైకి... మళ్లీ తీవ్రరూపం దాల్చుతున్న వైరస్ మహమ్మారి

02-04-2021 Fri 17:55
  • గత 24 గంటల్లో 31,116 కరోనా పరీక్షలు
  • 1,288 మందికి పాజిటివ్
  • గుంటూరు జిల్లాలో 311 మందికి కరోనా
  • అత్యల్పంగా పశ్చిమ గోదావరిలో 7 కేసులు
  • రాష్ట్రంలో ఐదుగురి మృత్యువాత 
Corona once again strikes in Andhra Pradesh state

ఏపీలో కరోనా వైరస్ మళ్లీ వేగం పుంజుకుంటోంది. గత కొన్నిరోజులుగా కొత్త కేసుల సంఖ్య 1000కి పైనే నమోదవుతోంది. గడచిన 24 గంటల్లో 31,116 కరోనా టెస్టులు నిర్వహించగా 1,288 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. ఒక్క గుంటూరు జిల్లాలోనే 311 కేసులు నమోదయ్యాయి.

చిత్తూరు జిల్లాలో 225, విశాఖ జిల్లాలో 191, కృష్ణా జిల్లాలో 164, నెల్లూరు జిల్లాలో 118 కేసులు వెల్లడయ్యాయి. అత్యల్పంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 7 పాజిటివ్ కేసులు గుర్తించారు. అదే సమయంలో 610 మంది కరోనా నుంచి కోలుకోగా, ఐదుగురు మరణించారు. తద్వారా మొత్తం కరోనా మృతుల సంఖ్య 7,225కి పెరిగింది.

రాష్ట్రంలో ఇప్పటివరకు 9,04,548 పాజిటివ్ కేసులు నమోదు కాగా 8,88,508 మంది కరోనా నుంచి కోలుకుని ఆరోగ్యవంతులయ్యారు. అటు కొత్త కేసుల ఉద్ధృతితో యాక్టివ్ కేసుల సంఖ్య మరింత పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో 8,815 కరోనా యాక్టివ్ కేసులున్నాయి.