వివేకా హత్య కేసులో అనుమానితుల పేర్లను వెల్లడించిన కుమార్తె సునీతారెడ్డి

02-04-2021 Fri 17:42
  • ఢిల్లీలో వివేకా కుమార్తె మీడియా సమావేశం
  • హత్య తర్వాత ప్రశాంతత కోల్పోయామని వెల్లడి
  • ప్రజల మద్దతు కోసమే ప్రెస్ మీట్ ఏర్పాటు చేసినట్టు వివరణ
  • అనుమానితుల జాబితాను అధికారులకు ఇచ్చానన్న సునీత
YS Sunitha Reddy reveals suspected persons names

తన తండ్రి హత్య కేసులో న్యాయం కోసం పోరాడే క్రమంలో అలిసిపోతున్నామని వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ సునీతారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీలో ఇవాళ ఆమె మీడియా సమావేశం నిర్వహించారు. ప్రెస్ మీట్ అనంతరం ఆమె ఓ మీడియా సంస్థ ప్రతినిధితో ప్రత్యేకంగా మాట్లాడారు. ఈ హత్య అనంతరం తమ జీవితాల్లో ప్రశాంతత అనేది లేకుండా పోయిందని విచారం వ్యక్తం చేశారు. అందుకు ప్రజల మద్దతు తీసుకుందామనే తాను ప్రెస్ మీట్ ఏర్పాటు చేశానని, ఈ హత్యకేసులో తమకు తెలిసిన విషయాలను ఎవరైనా వెల్లడించకపోతారా అని భావిస్తున్నామని పేర్కొన్నారు.  

తన తండ్రి వివేకా హత్యకేసులో 15 మంది అనుమానితుల జాబితాను దర్యాప్తు అధికారులకు అందజేసినట్టు వెల్లడించారు. ఆ అనుమానితుల్లో ఎంపీ అవినాశ్ రెడ్డి కూడా ఉన్నాడని తెలిపారు. భాస్కర్ రెడ్డి, మనోహర్ రెడ్డి, ఆదినారాయణరెడ్డిల పేర్లు కూడా ఉన్నాయని చెప్పారు. ఈ జాబితాలో మొదటిపేరు వాచ్ మన్ రంగన్న అని, అతని వ్యవహార శైలి ఎంతో అనుమానాస్పదంగా ఉందన్నారు.

ఆ తర్వాత పేరు ఎర్ర గంగిరెడ్డి అని, ఆయన తన తండ్రికి ఎంతో సన్నిహితుడని, హత్య జరిగిన తర్వాత ఘటన స్థలంలో మరకలు శుభ్రం చేయించింది ఆయనే అని ఆరోపించారు. పరమేశ్వర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి, శివశంకర్ రెడ్డిలకు సంబంధించి అనేక సందేహాలున్నాయని అన్నారు. ఇక తమ కుటుంబంలో తమకు కొందరు మద్దతుగా నిలుస్తున్నారని వెల్లడించారు. ఈ కేసులో ఇప్పటికే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డిని కూడా కలిశానని తెలిపారు. దర్యాప్తు సంస్థలు ఈ కేసుకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చి పరిష్కరించాలని సునీతారెడ్డి కోరారు.