మాజీ సీఎం సోదరుడు, ప్రస్తుత సీఎం బాబాయి హత్య జరిగితే ఇంతవరకు పురోగతి లేకపోవడం దారుణం: వివేకా కుమార్తె సునీతారెడ్డి

02-04-2021 Fri 15:36
  • వివేకా హత్యపై ఆయన కుమార్తె మీడియా సమావేశం
  • రెండేళ్లవుతున్నా దోషులను పట్టుకోలేదని వ్యాఖ్యలు
  • సామాన్యుడి పరిస్థితి ఏంటని ప్రశ్న
  • కేసు వదిలేయమని సలహా ఇచ్చారన్న సునీతారెడ్డి
  • న్యాయం కోసం పోరాడమని మనసు చెబుతోందని వెల్లడి
Sunitha Reddy press meet on her father YS Vivekananada Reddy murder case

వైసీపీ మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగి రెండేళ్లవుతున్నా, ఇప్పటివరకు ఈ కేసులో ఎలాంటి పురోగతి లేదని ఆయన కుమార్తె డాక్టర్ సునీతారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డికి సోదరుడు, ప్రస్తుత సీఎం జగన్ కు బాబాయి అయిన తన తండ్రి హత్యకు గురైతే ఇంతవరకు దోషులను పట్టుకోలేదంటే, సామాన్యుల పరిస్థితి ఏంటని ఆమె ప్రశ్నించారు.

ఈ హత్య కేసు గురించి వదిలేయమని తనకు చాలామంది సలహా ఇచ్చారని, కానీ తన మనసు మాత్రం న్యాయం కోసం పోరాడమని చెబుతోందని ఆమె వెల్లడించారు. "నాకు, నా పిల్లలకు హాని జరుగుతుందని చెప్పారు. కానీ ఈ కేసులో ముందుకెళ్లాలనే నిర్ణయించుకున్నాను" అంటూ స్పష్టం చేశారు. ఇది రాజకీయ హత్యే అయ్యుంటుందని, తనకు తెలిసినంత వరకు తన తండ్రికి శత్రువులు లేరని ఆమె స్పష్టం చేశారు. ఆర్థికపరమైన వివాదాలు కూడా ఏమీ లేవన్నారు.

కేసు విచారణ గురించి ఓ అధికారిని అడిగితే... కడప, కర్నూలు ప్రాంతాల్లో ఇలాంటివి సహజం అన్న సమాధానం వినిపించిందని, దాంతో తాను దిగ్భ్రాంతికి గురయ్యానని సునీతారెడ్డి వివరించారు. 60 ఏళ్ల వయసున్న ఒంటరి వ్యక్తిని అంత దారుణంగా చంపాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. తన పెదనాన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి, తన తండ్రి వివేకా ఈ ప్రాంతం కోసం ఎంతో చేశారని, తన తండ్రి అనేక స్థాయుల్లో పనిచేశారని తెలిపారు.

ఈ కేసులో న్యాయం కోసం ఇంకా ఎంత కాలం వేచిచూడాలో అర్థం కావడంలేదని పేర్కొన్నారు. తన తండ్రి ఎందరికో మేలు చేశారని, కానీ ఇవాళ ఆయన గురించి మాట్లాడేందుకు చాలామంది జంకుతున్నారని సునీతారెడ్డి తెలిపారు. సాక్షులు ధైర్యంగా ముందుకొచ్చి కేసు విచారణలో సాయపడాలని ఆమె విజ్ఞప్తి చేశారు.

తన తండ్రి హత్యకేసులో 15 మంది అనుమానితుల పేర్లు ఇచ్చామని, కానీ విచారణ జరుగుతున్న తీరు చూస్తుంటే సందేహాలు కలుగుతున్నాయని అన్నారు. సాక్షులకేమైనా జరుగుతుందేమోనన్న భయం కలుగుతోందని పేర్కొన్నారు. దర్యాప్తుపై వివరణ కోరితే రాష్ట్రం నుంచి ఇప్పటికీ సమాధానం రాలేదని వెల్లడించారు.

ఈ సందర్భంగా సునీతారెడ్డి... వైఎస్ షర్మిల ప్రస్తావన తీసుకువచ్చారు. ఈ వ్యవహారంలో తప్పు జరిగిందని షర్మిలకు తెలుసని అన్నారు. అయితే షర్మిల న్యాయం వైపే ఉంటుందని, తమకు అండగా ఉంటుందని ఆమె నమ్మకం వ్యక్తం చేశారు.