పోటీకి ముందే అస్త్ర సన్యాసం చేస్తారా?: టీడీపీ నేతలపై విజయసాయిరెడ్డి వ్యంగ్యం

02-04-2021 Fri 15:09
  • పరిషత్ ఎన్నికల బహిష్కరణ దిశగా టీడీపీ!
  • 40 శాతం పంచాయతీలు గెలిచినట్టు డప్పుకొట్టారన్న విజయసాయి
  • ఇప్పుడు తర్జనభర్జనలేంటని వ్యంగ్యం
  • మున్సిపల్ ఎన్నికల్లో మీ రంగు బయపడిందనా? అంటూ ఎద్దేవా
YSRCP MP Vijayasai Reddy satires on TDP

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను బహిష్కరించాలని టీడీపీ భావిస్తుండడంపై వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి వ్యంగ్యం ప్రదర్శించారు. ఇటీవల 40 శాతం పంచాయతీలు గెలిచామంటూ పచ్చనేతలు డప్పు కొట్టారని, ఇప్పుడు పరిషత్ ఎన్నికల్లో పోటీ చేయాలా? వద్దా? అంటూ తర్జనభర్జనలేంటని ప్రశ్నించారు. మున్సిపల్ ఎన్నికల్లో మీ రంగు బయటపడిందని సందేహమా? అంటూ ఎద్దేవా చేశారు. "ఇటీవల ఎన్నికల్లో ఆ మాత్రం సీట్లు వచ్చాయంటే అది నిమ్మగడ్డ చలవేనా? అయినా పోటీకి ముందే అస్త్రసన్యాసం చేస్తారా?" అంటూ వ్యాఖ్యానించారు.

కాగా, పరిషత్ ఎన్నికల్లో పోటీ చేసే అంశంపై టీడీపీ అధినేత చంద్రబాబు వీడియో కాన్పరెన్స్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పలువురు పార్టీ అభ్యర్థులు బరిలో ఉన్నందున ఆయన వారితో చర్చిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేస్తుందా? లేక బహిష్కరిస్తుందా? అనే అంశంపై మరికాసేపట్లో అధికారిక ప్రకటన వెలువడనుంది.