రాబర్ట్ వాద్రాకు కరోనా.. సెల్ఫ్ ఐసోలేషన్ లోకి ప్రియాంక గాంధీ

02-04-2021 Fri 14:41
  • టెస్టులో తనకు నెగెటివ్ వచ్చిందన్న ప్రియాంక
  • రాబోయే కొన్ని రోజులు అందుబాటులో ఉండనని వెల్లడి
  • తమిళనాడు, కేరళ, ఎన్నికల ప్రచారం రద్దు
Priyanka Gandhi in isolation after husband Robert Vadra tests positive for Covid19

ఏఐసీసీ కార్యదర్శి ప్రియాంకా గాంధీ భర్త రాబర్ట్ వాద్రాకు కరోనా పాజిటివ్ వచ్చింది. శుక్రవారం ఉదయం ఆయనకు కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. దీంతో ప్రియాంక గాంధీ ఐసోలేషన్ లోకి వెళ్లిపోయారు. అన్ని పర్యటనలు, ఎన్నికల ప్రచార సభలను రద్దు చేసుకున్నారు. ఈ విషయాన్ని ఆమె శుక్రవారం ట్విట్టర్ లో వెల్లడించారు.

తన భర్తకు పాజిటివ్ రావడంతో తాను కూడా టెస్ట్ చేయించుకున్నానని, నెగెటివ్ వచ్చిందని ఆమె చెప్పారు. ‘‘నాకేమీ కరోనా సోకలేదు. రిపోర్ట్ లో నెగెటివ్ వచ్చింది. కానీ, వైద్యుల సలహా మేరకు స్వీయ నిర్బంధంలో (సెల్ఫ్ ఐసోలేషన్) ఉన్నాను. కలిగిన అంతరాయానికి చింతిస్తున్నాను’’ అని ఆమె ట్వీట్ చేశారు. దీంతో కేరళ, తమిళనాడుల్లో నిర్వహించదలచిన ఎన్నికల ప్రచార సభలను రద్దు చేసుకుంటున్నట్టు ప్రకటించారు.

కాగా, అంతకుముందు తనకు కరోనా పాజిటివ్ వచ్చినట్టు రాబర్ట్ వాద్రా ఫేస్ బుక్ లో వెల్లడించారు. దురదృష్టవశాత్తూ ఎవరో కొవిడ్ పేషెంట్ తో కాంటాక్ట్ అయి ఉంటానని, దీంతో తనకూ పాజిటివ్ వచ్చిందని అన్నారు. కొవిడ్ మార్గదర్శకాల ప్రకారం తాను, కరోనా నెగెటివ్ వచ్చినా ప్రియాంక స్వీయ నిర్బంధంలోకి వెళ్లిపోయామన్నారు.