విజయ్ మూవీలో పవర్ఫుల్ విలన్ గా సీనియర్ హీరో?

02-04-2021 Fri 13:11
  • సెట్స్ పైకి విజయ్ 65వ సినిమా
  • కథానాయికగా పూజా హెగ్డే
  • వచ్చేనెల నుంచి రెగ్యులర్ షూటింగ్
  • విలన్ పాత్రలో అరవింద్ స్వామి?   

Senior actor will be seen as a powerful villian in vijay movie

విజయ్ హీరోగా ఈ మధ్య వచ్చిన 'మాస్టర్' తమిళనాట వసూళ్ల సునామీని సృష్టించింది. తెలుగులోనూ ఈ సినిమా మంచి వసూళ్లనే రాబట్టింది. తమిళంలో ఒక వైపున స్టార్ హీరోగా దూసుకుపోతున్న విజయ్ సేతుపతి ఈ సినిమాలో విలన్ గా నటించడం విశేషం. ఆయన వలన కూడా ఈ సినిమా మార్కెట్ ఊహించని విధంగా పెరిగిపోయింది.

అంతేకాదు, హీరోగా ఈ సినిమా విజయ్ కి ఎంతటి పేరు తెచ్చిందో .. విలన్ గా విజయ్ సేతుపతికి కూడా అంతే పేరు తెచ్చింది. విజయ్ క్రేజ్ కి తగిన విలన్ అనే పేరును విజయ్ సేతుపతి సొంతం చేసుకున్నాడు. ఇక ఇప్పుడు విజయ్ తన తదుపరి సినిమాకు రెడీ అవుతున్నాడు ... ఇది ఆయనకు 65వ సినిమా.

సన్ పిక్చర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమా రీసెంట్ గా పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. విజయ్ జోడీగా పూజా హెగ్డేను ఎంపిక చేశారు .. ఈ సినిమా కోసం ఆమె 4 కోట్ల వరకూ పారితోషికం తీసుకుంటూ ఉండటం విశేషం. ఇంతకుముందు తమిళంలో నయనతార ప్రధానపాత్రధారిగా 'కొలమావు కోకిల' ( కో కో కోకిల) సినిమాతో దర్శకుడిగా మంచి మార్కులు కొట్టేసిన నెల్సన్ దిలీప్ కుమార్, ఈ సినిమాకు దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు.

ఇక ఈ సినిమాలో విజయ్ తో తలపడే విలన్ ఎవరనేది అందరిలో ఆసక్తిని పెంచుతోంది. అరవింద్ స్వామిని తీసుకునే అవకాశాలు ఉన్నాయనేది కోలీవుడ్ టాక్. దాదాపు ఆయనే ఖాయం కావొచ్చని అంటున్నారు. వచ్చేనెలలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుందని తెలుస్తోంది.