ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల... ఈ నెల 8న పోలింగ్

01-04-2021 Thu 21:18
  • నీలం సాహ్నీ దూకుడు
  • ఎస్ఈసీ బాధ్యతలు స్వీకరించిన రోజే కీలక నిర్ణయం
  • అవసరమైన చోట 9న రీపోలింగ్
  • ఈ నెల 10న ఓట్ల లెక్కింపు
  • ఓటు హక్కు వినియోగించుకోనున్న 2.82 కోట్ల మంది
Notification released for MPTC and ZPTC elections in AP

ఏపీ ఎస్ఈసీగా బాధ్యతలు స్వీకరించిన రోజే నీలం సాహ్నీ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నిలకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నెల 8న పోలింగ్ నిర్వహించనున్నారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ ఉంటుంది. ఒకవేళ ఎక్కడైనా రీ పోలింగ్ చేపట్టాల్సి వస్తే ఈ నెల 9న నిర్వహిస్తారు. ఈ నెల 10వ తేదీన ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఓట్ల లెక్కింపు పూర్తయిన వెంటనే ఫలితాలు వెల్లడిస్తారు. కోర్టు పరిధిలో విచారణ ఎదుర్కొంటున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాల్లో ఎన్నికలు ఉండబోవని ఎన్నికల సంఘం పేర్కొంది.

కాగా, పరిషత్ ఎన్నికలకు కొత్త నోటిఫికేషన్ ఇస్తారని ఆశించిన విపక్షాలకు ఈ నిర్ణయం నిరాశ కలిగించేదే! ఎన్నికల ప్రక్రియ ఎక్కడ నిలిచిపోయిందో అక్కడ్నించే తిరిగి ప్రారంభించాలని నూతన ఎస్ఈసీ నీలం సాహ్నీ నిర్ణయించారు. ఏకగ్రీవాలు మినహా మిగిలిన చోట్ల ఎన్నికలు జరుపనున్నారు.

గతేడాది 660 జడ్పీటీసీలకు గాను 652 స్థానాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు. వాటిలో 126 ఏకగ్రీవాలు కాగా, మిగిలిన 526 స్థానాలకు పోలింగ్ జరగనుంది. రాష్ట్రంలో మొత్తం 10,047 ఎంపీటీసీ స్థానాలు ఉండగా, పలు అంశాల కారణంగా 354 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిలిచిపోయాయి. 2,371 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం కాగా, మిగిలిన 7,322 స్థానాలకు ఈ నెల 8న పోలింగ్ చేపడతారు.

పరిషత్ ఎన్నికల కోసం 33,663 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. 2.82 కోట్ల మంది తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.