రజనీకాంత్ కు దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారంపై పవన్ కల్యాణ్, పురందేశ్వరి స్పందన

01-04-2021 Thu 18:48
  • రజనీకాంత్ కు దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం
  • తలైవాపై అభినందనల వెల్లువ
  • విలక్షణ నటుడిగా అభివర్ణించిన పవన్ కల్యాణ్
  • తమ కుటుంబానికి ఎంతో సన్నిహితుడని వెల్లడి
  • మరెన్నో విజయాలు, ఘనతలు అందుకోవాలన్న పురందేశ్వరి
Pawan Kalyan and Purandeswri showers praises on Rajanikanth

దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ కు ప్రతిష్ఠాత్మక దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం దక్కడంతో ఆయనపై అభినందనల జడివాన కురుస్తోంది. తాజాగా జనసేనాని పవన్ కల్యాణ్, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పురందేశ్వరి సోషల్ మీడియా వేదికగా స్పందించారు.

రజనీకాంత్ ను ఓ విలక్షణ నటుడిగా పేర్కొన్న పవన్ కల్యాణ్... ఆయనకు దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం రావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. రజనీకాంత్ కు తన తరఫున, జనసైనికుల తరఫున శుభాకాంక్షలు తెలుపుతున్నట్టు పేర్కొన్నారు. తమిళ ప్రేక్షకులను గత నాలుగున్నర దశాబ్దాలుగా మెప్పిస్తున్న రజనీకాంత్ ఈ అవార్డుకు అన్ని విధాలా అర్హుడని కొనియాడారు. రజనీకాంత్ తమిళంలోనే కాకుండా, తెలుగులోనూ అభిమానులను సొంతం చేసుకున్నారని వివరించారు.

"రజనీకాంత్ మా కుటుంబానికి సన్నిహితులు. దాదాపు 30 ఏళ్ల కిందట అన్నయ్య చిరంజీవితో రజనీకాంత్ బందిపోటు సింహం, కాళీ అనే చిత్రాల్లో నటించారు. ఆ సినిమాలు ఇప్పటికీ నాకు గుర్తున్నాయి. ఆయన ఇకపైనా మరిన్ని మంచి చిత్రాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరించాలి" అంటూ పవన్ తన సందేశంలో ఆకాంక్షించారు.

ఇక, పురందేశ్వరి స్పందిస్తూ... దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకు ఎంపికైనందుకు అభినందనలు అంటూ ట్వీట్ చేశారు. రాబోయే సంవత్సరాల్లో రజనీకాంత్ మరిన్ని విజయాలు సాధించి, మరెన్నో ఘనతలు అందుకోవాలని కోరుకుంటున్నట్టు తెలిపారు.