Anupam Kher: బ్లడ్ కేన్సర్ తో బాధపడుతున్న బీజేపీ ఎంపీ, ప్రముఖ సినీ నటి కిరణ్​ ఖేర్​

Kirron Kher suffering from blood cancer undergoing treatment in Mumbai
  • ధ్రువీకరించిన ఆమె భర్త అనుపమ్ ఖేర్
  • మంచి వైద్యులు చికిత్స చేస్తున్నారని వెల్లడి
  • త్వరలోనే కోలుకుని ఇంటికి వస్తుందని కామెంట్ 
  • ఎడమ చెయ్యి, కుడి భుజానికి మైలోమా
  • కోకిలాబెన్ ఆసుపత్రిలో చికిత్స
బీజేపీ ఎంపీ, బాలీవుడ్ ప్రముఖ నటి కిరణ్ ఖేర్ కేన్సర్ బారిన పడ్డారు. ప్రస్తుతం ఆమె ముంబైలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మైలోమా అనే బ్లడ్ కేన్సర్  తో బాధపడుతున్నట్టు ఆమె భర్త, ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్ వెల్లడించారు. పుకార్లు చక్కర్లు కొడుతుండడంతో ఈ విషయాన్ని తానే స్వయంగా వెల్లడిస్తున్నానని ట్వీట్ చేశారు.

కిరణ్ ఖేర్ కు మల్టిపుల్ మైలోమా అనే రక్త కేన్సర్ వచ్చిందన్నారు. ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతోందని, ఇంతకుముందుతో పోలిస్తే మరింత దృఢంగా కోలుకుని వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అపార అనుభవం ఉన్న వైద్యులు ఆమెకు చికిత్స చేస్తున్నారని, అందుకు తాము చాలా అదృష్టవంతులమని అన్నారు.

ఆమె పోరాటయోధురాలని, సవాళ్లను ఎదుర్కొంటుందని చెప్పారు. కిరణ్ మంచి మనసున్న మహారాణి అని, అందుకే అందరూ ఆమెను అభిమానిస్తారని అనుపమ్ చెప్పుకొచ్చారు. త్వరగా కోలుకుని ఇంటికి వస్తుందని చెప్పారు. ఇంతటి ప్రేమాభిమానాలు చూపిస్తున్న అందరికీ అనుపమ్ ధన్యవాదాలు చెప్పారు.

కాగా, ఈ విషయాన్ని మొదట బీజేపీ చండీగఢ్ అధ్యక్షుడు అరుణ్ సూద్ వెల్లడించారు. గత ఏడాది నవంబర్ 11న చండీగఢ్ లో ఆమె ఎడమ చెయ్యి విరిగిపోయిందని, అక్కడి ఆసుపత్రిలో చేర్పించగా మల్టిపుల్ మైలోమా ఉన్నట్టు తేలిందని చెప్పారు. ఆ వ్యాధి ఆమె ఎడమ చెయ్యితో పాటు కుడిభుజానికి పాకిందన్నారు. చికిత్స కోసం డిసెంబర్ 4న ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రికి వెళ్లిందన్నారు. ప్రస్తుతం కోలుకుంటున్నారని చెప్పారు.
Anupam Kher
Kirron Kher
Bollywood
BJP

More Telugu News