'ఖైదీ' సినిమాకి సీక్వెల్ ఉంది: హీరో కార్తి 

01-04-2021 Thu 13:29
  • కార్తి తాజా చిత్రంగా 'సుల్తాన్'
  • కోలీవుడ్ లో రష్మిక ఫస్టు మూవీ
  • తెలుగులోను రేపే విడుదల
  • 'ఖైదీ' సీక్వెల్ విషయంలో క్లారిటీ      
Khaidi Movie has Sequel
కార్తి మొదటి నుంచీ కూడా విభిన్నమైన .. విలక్షణమైన పాత్రలను చేస్తూ వస్తున్నాడు. 'ఆవారా' .. 'ఖాకి' .. 'ఖైదీ' సినిమాలు అందుకు నిదర్శనం. ఇక తన సోదరుడైన సూర్య మాదిరిగానే మొదటి నుంచీ కూడా తన సినిమాలను తమిళంతో పాటు తెలుగులోను విడుదలయ్యేలా చూసుకుంటున్నాడు.

ఒకవిధంగా చెప్పాలంటే, రజనీ .. కమల్ .. అజిత్, విక్రమ్ .. సూర్య .. తరువాత తెలుగులో మంచి మార్కెట్ ఉన్న తమిళ హీరోగా కార్తి కనిపిస్తాడు. ఆయన తాజా చిత్రంగా 'సుల్తాన్' రూపొందింది. భారీ బడ్జెట్ తో .. భారీ తారాగణంతో నిర్మితమైన ఈ సినిమా, తమిళంతో పాటు తెలుగులోను రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాతోనే రష్మిక కోలీవుడ్ కి పరిచయమవుతుండటం విశేషం.

ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న రాత్రి హైదరాబాద్ లో జరిగింది. ఈ వేదికపై కార్తి మాట్లాడుతూ, 'సుల్తాన్' సినిమా విశేషాలను గురించి ప్రస్తావించాడు. ఈ కథను తాను 20 నిమిషాల్లో ఓకే చేశాననీ, కానీ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి మూడేళ్లు పట్టిందని అన్నాడు.

"నేను ఎక్కడికి వెళ్లినా అంతా కూడా 'ఖైదీ' సీక్వెల్ ఎప్పుడు? అని అడుగుతున్నారు. త్వరలోనే సీక్వెల్ ఉంటుంది" అంటూ ఆ విషయంలో ఆయన క్లారిటీ ఇచ్చాడు. హీరోయిన్ గానీ .. పాటలుగాని లేకుండా, సింగిల్ కాస్ట్యూమ్ తో కార్తి చేసిన 'ఖైదీ' సంచలన విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. సీక్వెల్లో అయినా హీరోయిన్ తో రొమాన్స్ .. రొమాంటిక్ సాంగ్స్ ఉంటాయేమో చూడాలి.