George Floyd: ‘జార్జ్​ ఫ్లాయిడ్​’ ఘటనను సమర్థించుకున్న పోలీస్​ అధికారి

  • ప్రత్యక్ష సాక్షితో సంభాషణల వీడియో విడుదల
  • అతడిని అదుపు చేసేందుకే అదిమిపట్టానన్న చవిన్
  • ఫ్లాయిడ్ ఏదో చేయబోతున్నాడని కామెంట్
  • కోర్టులో పోలీస్ అధికారి, సాక్షి విచారణ
Got To Control Him Cop Defends Restraint Of George Floyd In New Video

‘బ్లాక్ లైవ్స్ మ్యాటర్’.. జార్జ్ ఫ్లాయిడ్ పై అమెరికా పోలీసుల దాష్టీకానికి నిరసనగా ప్రపంచం మొత్తం చేపట్టిన ఉద్యమం. ట్విట్టర్, ఫేస్ బుక్, ఇతర సామాజిక మాధ్యమాల్లో ఆ హాష్ ట్యాగ్ ఎంత ట్రెండ్ అయిందో తెలిసిందే. అమెరికాలోని మినియాపొలిస్ కు చెందిన ముగ్గురు పోలీసు అధికారులు.. తన దారిలో తాను పోతున్న జార్జ్ ఫ్లాయిడ్ అనే నల్ల జాతీయుడిని కిందపడేసి మోకాళ్లతో గొంతుపై అదిమిపట్టిన ఘటన గురించి తెలిసిందే. ఆ ఘటనలో ఫ్లాయిడ్ చనిపోయాడు. ఇటీవలే మినియాపొలిస్ సిటీ తరఫున ఫ్లాయిడ్ కుటుంబానికి పరిహారాన్ని అందజేసింది.

అయితే, నాడు జరిగిన ఆ ఘటనను సమర్థించుకున్నాడు ఆ ఘటనకు కారకుడైన పోలీస్ అధికారి డెరిక్ చవిన్. ఫ్లాయిడ్ ఏదో చేయడానికే వచ్చాడని, అతడిని అదుపు చేసేందుకే అదిమిపట్టానని చెప్పాడు. తాజాగా విడుదల చేసిన బాడీ కెమెరా వీడియో ఫుటేజీలో అతడు ఈ వ్యాఖ్యలు చేశాడు. బుధవారం విచారణ సందర్భంగా కోర్టులో ఆ వీడియో ఫుటేజీని జడ్జి ప్లే చేశారు. ఘటన సమయంలో అక్కడే ఉన్న ప్రత్యక్ష సాక్షి, మరో నల్లజాతీయుడు మెక్ మిలాన్ తో డెరిక్ చవిన్ సంభాషణలు ఆడియోలో రికార్డయ్యాయి.


ఫ్లాయిడ్ గొంతుపై మోకాలితో అదిమిపట్టడాన్ని మెక్ మిలాన్ అనే 61 ఏళ్ల మరో నల్లజాతీయుడు చూశాడు. చవిన్ ను అడ్డుకున్నాడు. పోలీసులకు సహకరించాల్సిందిగా ఇటు ఫ్లాయిడ్ నూ అర్ధించాడు. దీంతో ‘‘ఇంత భారీ మనిషిని మేం అదుపు చేయాలి. అతడు ఏదో చేయడానికే వచ్చాడు’’ అని వ్యాఖ్యానించాడు.

ఈ క్రమంలోనే ‘‘నన్ను చంపేస్తారా?’’ అంటూ ఫ్లాయిడ్ ప్రశ్నించాడు. దాదాపు తొమ్మిది నిమిషాల పాటు అలాగే అదిమి ఉంచడంతో నాడి ఆగిపోయిందంటూ పక్కనే ఉన్న మరో అధికారి చవిన్ కు చెప్పాడు. అప్పటికీ అతడు కాలు తియ్యలేదు.

దీంతో ఏమీ చేయలేక.. ‘దేవుడా’ అనుకుంటూ మెక్ మిలాన్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. గొంతు మీద కాలేసి తొక్కడానికి ముందు.. ఫ్లాయిడ్ ను పోలీసులు కారులోకి ఎక్కించే ప్రయత్నం చేశారు. అప్పుడే ‘నువ్వు గెలవలేవు.. కారు ఎక్కు’ అంటూ ఫ్లాయిడ్ కు మెక్ మిలాన్ చెప్పాడు. అయితే, తాను గెలిచేందుకు ప్రయత్నించట్లేదని ఫ్లాయిడ్ సమాధానమిచ్చాడు. తానేమీ చెడ్డవాడిని కాదని చెబుతున్నట్టు వీడియోలో రికార్డ్ అయింది.

More Telugu News