Small Savings: పొరపాటా? మీ గిమ్మిక్కా?: వడ్డీ రేట్లపై బీజేపీని టార్గెట్ చేసిన కాంగ్రెస్

  • నిన్న రాత్రి వడ్డీ రేట్లను తగ్గిస్తున్నట్టు ప్రకటన
  • ఆపై గంటల వ్యవధిలోనే ఉత్తర్వుల ఉపసంహరణ
  • నిర్మలా సీతారామన్ రాజీనామా చేయాలంటున్న కాంగ్రెస్
Congress Demands Nirmala Sitharaman Resign

వివిధ రకాల చిన్న మొత్తాల పొదుపు ఖాతాలపై వడ్డీ రేట్లను భారీగా తగ్గిస్తూ, నిన్న ప్రకటన విడుదల చేసిన కేంద్రం, విమర్శలు వెల్లువెత్తిన తరువాత, ఈ ఉదయం ఆ నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్న సంగతి తెలిసిందే.

అయితే, కొన్ని గంటల వ్యవధిలోనే కేంద్రం ఈ విషయంలో వెనకడుగు వేయడంపై కాంగ్రెస్ సెటైర్లు వేసింది. కోట్ల మంది ఖాతాలపై ప్రభావం చూపే నిర్ణయాలపై పొరపాటు ఎలా జరగిందని ప్రశ్నించిన కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు ఆ పదవిలో కొనసాగే నైతికత లేదని మండిపడ్డారు.

తొలుత ఉత్తర్వులను జారీ చేసి, ఆపై పొరపాటు చేశామని, దిద్దుబాటు చర్యగా నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంటున్నామని, పాత వడ్డీ రేట్లే కొనసాగుతాయని నిర్మలా సీతారామన్, ఈ ఉదయం తన ట్విట్టర్ ఖాతాలో ప్రకటించిన విషయాన్ని గుర్తు చేసిన ప్రియాంకా గాంధీ, దీని వెనుక బీజేపీ ఎన్నికల దూరదృష్టి దాగుందని, ఇది ఓ గిమ్మిక్కని అన్నారు. కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా సైతం బీజేపీపై మండిపడ్డారు. ఆర్థిక మంత్రి ఏమైనా సర్కస్ నడుపుతున్నారా? అని ప్రశ్నించారు.

కేంద్రంలో సర్కారు ఉన్నట్టు కనిపించడం లేదని, ఇటువంటి ఆదేశాల్లో పొరపాటు ఎలా జరుగుతుందని ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన ఆయన, దీనికి ఎవరు బాధ్యత తీసుకుంటారని అడిగారు. నిర్మలా సీతారామన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

More Telugu News