Udhayanidhi: మోదీని చూసి భయపడడానికి నేను పళనిస్వామిని కాదు.. కరుణ మనవడిని: ఉదయనిధి స్టాలిన్

  • ఇప్పుడు రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారు.. ఇకపై మోదీకి అమ్మేస్తారు
  • జయలలిత ఎలా చనిపోయారని అన్నాడీఎంకే నేతలను ప్రశ్నించండి
  • ఈపీఎస్ సహా మంత్రులందరూ జైలుకెళ్లడం ఖాయం
  • జయలలిత ఇడ్లీ, ఉప్మా తిన్నందుకే రూ. 100 కోట్ల బిల్లు వచ్చిందా?
Udhayanidhi Stalin questions PM Modi on charges of sidelining others in DMK

మోదీని చూసి భయపడడానికి తానేమీ ముఖ్యమంత్రి ఈపీఎస్‌ను కాదని, కరుణానిధి మనవడినని డీఎంకే నేత, స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ అన్నారు. అన్నాడీఎంకే నేతలు వచ్చి ఓట్లు అడిగితే జయలలిత ఎలా చనిపోయారని ప్రశ్నించాలని సూచించారు. ఈరోడ్ జిల్లాలోని చెన్నిమలైలో నిన్న నిర్వహించిన ప్రచారంలో మాట్లాడుతూ ఆయనీ వ్యాఖ్యలు చేశారు.

గత లోక్‌సభ ఎన్నికల్లో బుద్ధి చెప్పినట్టుగానే ఈ ఎన్నికల్లోనూ మోదీకి, పళనిస్వామికి బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి పళనిస్వామి రాష్ట్ర హక్కులన్నింటినీ ఢిల్లీకి తాకట్టుపెట్టేశారని, మరికొన్ని రోజులు ఆగితే రాష్ట్రాన్నే మోదీకి అమ్మేస్తారని విరుచుకుపడ్డారు.

తాను తప్పుడు దారిలో వస్తున్నానని మోదీ అన్నారని, ఆయనను చూసి భయపడేందుకు తానేమీ పళనిస్వామిని కాదని, కలైంజ్ఞర్ మనవడినని గుర్తు చేశారు. రెండాకుల గుర్తుకు వేసే ఒక్కో ఓటు మోదీకి చేరుతుందన్నారు. అమ్మ జయలలిత ఆసుపత్రిలో ఉన్నప్పుడు ఆమె ఇడ్లీ, ఉప్మా తిన్నారని చెప్పారని, మరి ఆసుపత్రి బిల్లు రూ. 100 కోట్లు ఎలా వచ్చిందని ప్రశ్నించారు. అయినా, చివరికి అమ్మ చనిపోయారని అన్నారు.

తాము అధికారంలోకి వచ్చిన వెంటనే జయలలిత మృతిపై విచారణ జరిపిస్తామన్నారు. నిందితులకు శిక్ష తప్పదని స్టాలిన్ హెచ్చరించిన విషయాన్ని ఈ సందర్భంగా ఉదయనిధి గుర్తు చేశారు. రాష్ట్రాన్ని అవినీతికూపంగా మార్చిన పళనిస్వామి సహా మంత్రులందరూ జైలుకు వెళ్లక తప్పదని ఆయన హెచ్చరించారు.

More Telugu News