Farm Laws: ఆగని అన్నదాతల ఆందోళన.. మే నెలలో పార్లమెంట్‌ మార్చ్‌

  • రేపటి నుంచి ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామన్న రైతులు
  • ఏప్రిల్‌ 10న కేఎంపీ ఎక్స్‌ప్రెస్‌వే దిగ్బంధం
  • మార్చ్‌లో రైతులతో పాటు మహిళలు, ఆదివాసీలు, బహుజనులు
  • పోలీసుల దాడిని అడ్డుకునేందుకు ప్రత్యేక కమిటీలు
Farmers announce Parliament March in May

కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా గత నాలుగు నెలలుగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేస్తున్న ఆందోళన ఇంకా కొనసాగుతూనే ఉంది. ఏప్రిల్‌ 1 నుంచి తమ పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని రైతు సంఘాల నేతలు బుధవారం తెలిపారు. ఏప్రిల్‌ 10న కేఎంపీ ఎక్స్‌ప్రెస్‌వేని 24 గంటల పాటు దిగ్భందించనున్నట్లు సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కేఎం) నేతలు వెల్లడించారు.

అలాగే మే నెల ప్రథమార్ధంలో పార్లమెంట్‌ మార్చ్‌ చేపట్టాలని రైతు సంఘాల నేతలు నిర్ణయించారు. అయితే, ఏ రోజు నిర్వహించాలనే తేదీలను మాత్రం ఇంకా ఖరారు చేయలేదు. ఈ మార్చ్‌లో రైతులతో పాటు కార్మికులు, మహిళలు, దళితులు, ఆదివాసీలు, బహుజనులు, నిరుద్యోగ యువతను కూడా ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. నిరసనకారులంతా తొలుత సింఘూ, టిక్రీ, గాజీపూర్‌ ప్రాంతాలకు వాహనాల్లో చేరుకోవాలని తెలిపారు. అక్కడి నుంచి పాదయాత్రగా బయల్దేరి వెళ్తారని పేర్కొన్నారు. చట్టాలను రద్దు చేసే వరకు తమ పోరాటం ఆగదని నేతలు తేల్చి చెప్పారు.

ఒకవేళ మార్చ్‌లో పాల్గొన్న నిరసనకారులపై పోలీసులు దాడి చేస్తే రక్షణగా ఉండేందుకు ఓ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ కమిటీ ఆందోళనకారులకు పూర్తి స్థాయి అవగాహన కల్పిస్తుందని తెలిపారు.

More Telugu News