Mamata Banerjee: సోనియా, జగన్, కేసీఆర్ లతో పాటు కీలక నేతలకు మమతా బెనర్జీ లేఖ

  • బీజేపీకి వ్యతిరేకంగా ఏకమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది
  • ప్రస్తుత ఎన్నికల తర్వాత అందరం భేటీ అవుదాం
  • మీ అందరితో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నా
Mamata Banerjee writes letter to 10 key opposition leaders

బీజేపీకి వ్యతిరేకంగా అందరూ ఏకమవ్వాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొంటూ పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దేశంలోని 10 మంది కీలకమైన విపక్ష నేతలకు లేఖలు రాశారు. ఈ 10 మందిలో యూపీఏ ఛైర్ పర్సన్ సోనియాగాంధీ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, డీఎంకే చీఫ్ స్టాలిన్, శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే, వైసీపీ చీఫ్ జగన్, బీజేడీ అధినేత నవీన్ పట్నాయక్, టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్, సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఉన్నారు.

ప్రస్తుతం వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికలు ముగిసిన తర్వాత అందరం భేటీ అవుదామని లేఖలో మమత కోరారు. ప్రజాస్వామ్యం, రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్న బీజేపీపై పోరాటం చేయడానికి అందరం చేతులు కలుపుదామని అన్నారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ కు అత్యధిక అధికారాలను కట్టబెడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త చట్టాన్ని కూడా లేఖలో ఆమె ప్రస్తావించారు.

బీజేపీయేతర పార్టీలు వారి హక్కులను, స్వేచ్ఛను వినియోగించుకునే పరిస్థితి లేకుండా చేయాలని ఆ పార్టీ భావిస్తోందని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వ అధికారాలను నిర్వీర్యం చేయాలనుకుంటోందని... రాష్ట్రాలను మున్సిపాలిటీల స్థాయికి దిగజార్చాలనుకుంటోందని పేర్కొన్నారు. యావత్ దేశాన్ని ఒకే పార్టీ పాలించేలా చేయాలనుకుంటోందని చెప్పారు.

బీజేపీని కలసికట్టుగా ఎదుర్కోవాల్సిన సమయం ఆసన్నమైందని... ఈ పోరాటంలో టీఎంసీ చైర్ పర్సన్ గా భావసారూప్యత ఉన్న మీలాంటి పార్టీలతో కలసి పని చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని లేఖలో మమత తెలిపారు.

More Telugu News