Raghu Rama Krishna Raju: సరసమైన ధరలకు ఇళ్ల పట్టాలు... మరో భూదందా కోసమే: రఘురామకృష్ణరాజు

  • ప్రభుత్వోద్యోగులకు టూవీలర్లు ఇస్తామంటున్నారు
  • పింఛన్లకే డబ్బులు లేకపోతే వాటికి ఎక్కడి నుంచి తెస్తారు?
  • కేంద్రం ఇస్తున్న నిధులను రాష్ట్ర ఖజానాలో వేసుకుంటున్నారన్న రఘురాజు  
This is going to be another land scam says Raghu Rama Krishna Raju

క్లియర్ టైటిల్ ఉన్న భూములను సేకరించి, అర్హులైన వారికి సరసమైన ధరకు ఇళ్ల పట్టాలను ఇవ్వాలనే పథకానికి వైసీపీ ప్రభుత్వం శ్రీకారం చుడుతున్న సంగతి తెలిసిందే. ఈ పథకంపై వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు మాట్లాడుతూ విమర్శలు గుప్పించారు. మరో భూదందా కోసమే ఈ పథకాన్ని తీసుకొస్తున్నారని అన్నారు. జిల్లా కేంద్రాల్లో లేఔట్లు వేసి అమ్ముతామనడంలో దందా కోణం ఉందని ఆరోపించారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ప్రభుత్వ ఉద్యోగులకు టూ వీలర్స్ ఇస్తామంటున్నారని... పింఛన్లు ఇవ్వడానికే డబ్బులు లేనప్పుడు, వీటికి నిధులు ఎక్కడి నుంచి తెస్తారని రఘురాజు ప్రశ్నించారు. పశువులకు అంబులెన్స్ అని మరో గొప్ప పథకం పెట్టారని... దానికంటే పశువైద్యులకు టూవీలర్లు ఇచ్చి పశువుల వద్దకు పంపితే బాగుంటుందని అభిప్రాయపడ్డారు.

సర్పంచ్ ల అధికారాలను లాక్కుంటున్నారని మండిపడ్డారు. గ్రామాల అభివృద్ధి కోసం కేంద్రం ఇస్తున్న నిధులను రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలో వేసుకుంటున్నారని విమర్శించారు. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ పై కక్షపూరితంగా వ్యవహరించినప్పటికీ... మొక్కవోని ధైర్యంతో ఆయన ముందుకెళ్లారని కొనియాడారు. నిమ్మగడ్డకు పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేశారు.

More Telugu News