West Bengal: 'జనగణమన...' వినిపిస్తుంటే వీల్ చైర్ నుంచి లేచి నిలబడిన మమతా బెనర్జీ!

  • బెంగాల్ తొలి దశ పోలింగ్ కు తెర
  • చివరి రోజున నందిగ్రామ్ లో పర్యటించిన మమత
  • గురువారం నాడు పోలింగ్
Mamata Benerjee Stand After Listening National Anthem

పశ్చిమ బెంగాల్ లో ఎన్నికలు జరుగుతున్న వేళ, తొలి దశ పోలింగ్ ప్రచారం మంగళవారంతో ముగిసింది. నందిగ్రామ్ నుంచి బరిలోకి దిగిన మమతా బెనర్జీ, నిన్నటి ఎన్నికల ప్రచారంలో జాతీయగీతం వినిపిస్తుంటే, వీల్ చైర్ నుంచి లేచి నిలబడ్డారు. ఆమె నిలబడేందుకు సహాయకులు సాయపడ్డారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్ కేంద్ర బిందువుగా నిలిచిన సంగతి తెలిసిందే. గతంలో తనతో పాటు ఉండి, ఆపై బీజేపీలో చేరిన సువేందు అధికారిపై మమత ఇక్కడ పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. రేపు ఇక్కడ పోలింగ్ జరుగనుంది.

నందిగ్రామ్ నుంచి నామినేషన్ వేసేందుకు వెళ్లిన వేళ, మమతా బెనర్జీ కాలికి గాయం కాగా, అప్పటి నుంచి ఆమె వీల్ చైర్ లో కూర్చుని పర్యటిస్తూనే ప్రచార కార్యక్రమాలను పర్యవేక్షించిన సంగతి తెలిసిందే. పలు ర్యాలీల్లో, పాదయాత్రల్లోనూ ఆమె వీల్ చైర్ పైనే కనిపించారు.

తొలి విడత ఎన్నికల ప్రచారాన్ని ముగించే వేళ, ఆమె ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ, "గతంలో నేను ఎన్నోమార్లు గాయపడ్డాను. నా కాళ్లకు పలుమార్లు గాయాలు అయ్యాయి. వాటి బాధను ఓర్చుకుంటూనే బయటపడ్డాను. ఆ బాధను తట్టుకోలేక, నేను బీజేపీకి లొంగితే, అది ప్రజల బాధగా మారుతుంది. అప్పుడు నేను పడే బాధ కన్నా ప్రజలు పడే బాధే పెద్దదవుతుంది" అని వ్యాఖ్యానించారు.

ఇదిలావుంచితే, ఇక్కడ మమతా బెనర్జీ, సువేందు అధికారి నుంచి గట్టి పోటీని ఎదుర్కోక తప్పదని ఎన్నికల విశ్లేషకులు అంటున్నారు. పశ్చిమ బెంగాల్ లో వామపక్ష ప్రభుత్వం ఉన్న వేళ, నందిగ్రామ్ లో ఓ సంస్థ వాహన తయారీ పరిశ్రమ పెట్టేందుకు సిద్ధపడితే, మమతా బెనర్జీ తీవ్రంగా వ్యతిరేకించిన సంగతి తెలిసిందే.

రైతులు నాడు చేసిన పోరాటానికి క్షేత్ర స్థాయిలో నాయకత్వం వహించింది సువేందు అధికారే. ఆపై ఆయనే అక్కడి నుంచి తృణమూల్ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. తాను ఈ ప్రాంతం వాడినని, మమత గెలిస్తే, రాజకీయాల నుంచి వెళ్లిపోతానని సువేందు ప్రచారం చేశారు. గురువారం జరిగే ఎన్నికల తరువాత మే 2 వరకూ ఫలితాల కోసం నిరీక్షించాల్సిందే.

More Telugu News