Kerala: బంగారం ముక్కల కోసం రాష్ట్ర ప్రజలను మోసం చేసిన ఎల్డీఎఫ్: కేరళ ప్రభుత్వంపై మోదీ విమర్శలు

LDF Betrayed Kerala People for Some Pieces ofGold
  • కేరళలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు
  • పాలక్కాడ్ లో నరేంద్ర మోదీ భారీ ర్యాలీ
  • ఎల్డీఎఫ్, యూడీఎఫ్ మధ్య ఏళ్లుగా రహస్య ఒప్పందం
అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ కేరళలో ప్రచారం ఊపందుకుంది. కేరళలో సత్తా చాటాలని భావిస్తున్న బీజేపీ నేతలు ఇప్పటికే పలుమార్లు రాష్ట్రంలో ప్రచారం నిర్వహించారు. ఈ ఉదయం స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ రంగంలోకి దిగి, బీజేపీ తరఫున నిలబడిన అభ్యర్థుల గెలుపు కోరుతూ పాలక్కాడ్ లో భారీ ర్యాలీని నిర్వహించారు.

ఇదే సమయంలో ఆయన మాట్లాడుతూ, ఎల్డీఎఫ్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. కొన్ని వెండి ముక్కల కోసం ఏసు ప్రభువును జూడస్ మోసగించినట్టుగా..  కేరళ ప్రజలను కొన్ని బంగారం ముక్కల కోసం ఎల్డీఎఫ్ మోసం చేసిందని ప్రధాని ఆరోపించారు. ఇటీవలి కాలంలో చోటుచేసుకున్న గోల్డ్ స్మగ్లింగ్ కుంభకోణంలో ఎల్డీఎఫ్ ప్రమేయంపై వస్తున్నా వార్తలను దృష్టిలో పెట్టుకుని ప్రధాని ఆ విధముగా అన్నారు.

ఇప్పుడు రాష్ట్ర ప్రజలందరికీ ఎల్డీఎఫ్, యూడీఎఫ్ ఏళ్ల తరబడి చేస్తున్న కుంభకోణాలపై అవగాహన ఉందని, ఈ రెండు పార్టీల మధ్యా ఎన్నో ఏళ్లుగా రహస్య ఒప్పందం నడుస్తోందని మోదీ ఆరోపించారు. రెండు కూటములూ కలిసి ప్రజలను వంచించాయని, కేరళలో తొలిసారిగా ఓటు హక్కును పొందిన వారంతా ఈ విషయాన్ని ప్రశ్నిస్తున్నారని అన్నారు.

కాగా, పాలక్కాడ్ లో ర్యాలీ తరువాత నరేంద్ర మోదీ తమిళనాడు, పుదుచ్చేరిలోనూ పర్యటించి, ఎన్నికల సభల్లో ప్రసంగించనున్నారు. ఇదే సమయంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అసోంలో, హోమ్ మంత్రి అమిత్ షా పశ్చిమ బెంగాల్ లో జరిగే సభల్లో పాల్గొననున్నారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అసోంలో, ప్రియాంకా గాంధీ కేరళలో నేడు ప్రచారం నిర్వహించనున్నారు.
Kerala
Narendra Modi
Palakkad

More Telugu News