Maharashtra: నాందేడ్ గురుద్వారాలో పోలీసులపై కత్తులతో నిరసనకారుల దాడి!

Sikh Protesters Attack on Police in Nanded
  • గురుద్వారాలో 'హోలా మోహుల్లా' ఉత్సవం
  • కరోనా కారణంగా అనుమతి రద్దు
  • వినకుండా పోలీసులపై దాడికి దిగిన సిక్కు నిరసనకారులు
మహారాష్ట్రలోని నాందేడ్ లో ఉన్న గురుద్వారా రక్తసిక్తమైంది. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న వేళ, ప్రజలు గుంపులుగా ఉండరాదన్న నిబంధనలను అధికారులు అమలు చేస్తున్న వేళ, గురుద్వారా వద్ద వందలాది మంది చేరారు. వారిని పోలీసులు అడ్డగించడంతో, సిక్కు నిరసనకారులు కొందరు కత్తులు చేతపట్టి, పోలీసులపై దాడి చేశారు. ఈ ఘటనలో నలుగురు పోలీసులకు గాయాలు అయ్యాయి. పోలీసుల వాహనాలను నిరసనకారులు ధ్వంసం చేశారు.

ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. గురుద్వారా కాంప్లెక్స్ నుంచి కత్తులతో బయటకు దూసుకుని వచ్చిన నిరసనకారులు, బారికేడ్లను ధ్వంసం చేసి, అక్కడే విధుల్లో ఉన్న పోలీసుల పైకి వచ్చారు. వీడియోలను పరిశీలించిన తరువాత 18 మందిని అదుపులోకి తీసుకున్నామని సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ప్రమోద్ కుమార్ షీవాలే వెల్లడించారు. గురుద్వారాలో జరగాల్సిన 'హోలా మోహల్లా' ఉత్సవాలకు కరోనా కారణంగా అనుమతి లేదని ముందుగానే చెప్పామని అన్నారు.

ఈ విషయంలో గురుద్వారా అధికారులకు పరిస్థితిని వివరించి, ఎటువంటి ప్రత్యేక పూజలు, సామూహిక ప్రార్థనలు వద్దని చెప్పినా వారు వినలేదని షీవాలే వెల్లడించారు. హోలా మొహల్లాలో భాగంగా సిక్కులు తమలోని మార్షల్ స్కిల్స్ ను ప్రదర్శిస్తారన్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా తీసుకుని వచ్చిన ఆయుధాలతోనే పోలీసులపై వారు దాడి చేశారు. ఎటువంటి సామూహిక ఉత్సవాలకూ అనుమతి లేదని స్పష్టం చేసినా, స్థానికులు మాత్రం వినకుండా గురుద్వారాకు చేరుకుని ఆందోళన చేశారని స్పష్టం చేశారు.
Maharashtra
Nanded
Gurudwara
Sikh Protesters

More Telugu News