Sopore: సోపోర్ లో బీజేపీ నేతను హత్య చేసింది లష్కరే తోయిబా ఉగ్రవాదులే!

  • మునిసిపల్ కౌన్సిల్ సమావేశంపై దాడి
  • బులెట్ గాయాలతో ఇద్దరి మృతి
  • ఉగ్రవాదుల కోసం గాలింపు
LET Militents Attack on Municipal Meeting in Sopore

జమ్మూ కశ్మీర్ పరిధిలోని సోపోర్ మునిసిపల్ కౌన్సిల్ సమావేశం జరుగుతున్న వేళ, లష్కరే తోయిబా ఉగ్రవాదులు దాడి చేసి, బీజేపీ నేత, కౌన్సిలర్ ను, మరో సెక్యూరిటీ గార్డును హత్య చేశారు. ఈ ఘటనలో మరో కౌన్సిలర్ కు తీవ్రగాయాలు అయ్యాయి. ఉగ్రవాదులు ఆయుధాలతో దాడి చేశారని వెల్లడించిన ఓ ఉన్నతాధికారి, ఈ దాడిలో నింగ్లీ కౌన్సిలర్ రియాజ్ అహ్మద్ పీర్, ఎస్పీఓ షఫాఖత్ నాజిర్ ఖాన్ లకు బులెట్లు తగిలి తీవ్ర గాయాలు అయ్యాయని, వారిని ఆసుపత్రికి తరలించేలోపే ప్రాణాలు పోయాయని అన్నారు.

ఈ దాడిని మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా సహా పలు రాజకీయ పార్టీల నేతలు ఖండించారు. మృతులకు సంతాపం తెలుపుతున్నట్టు అబ్దుల్లా ట్వీట్ చేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నానని అన్నారు. శ్రీనగర్ మేయర్ జునైద్ ఆజిమ్ మట్టు ఈ దాడిని తీవ్రంగా ఖండించారు.

దాడి జరిగిన ప్రాంతాన్ని సందర్శించిన కాశ్మీర్ జోన్ఐజీ విజయ్ కుమార్, దాడికి పాల్పడిన వారు స్థానిక ఎల్ఈటీ టెర్రరిస్టులని గుర్తించామని అన్నారు. ఈ ఘటన వెనుక ముదాసిర్ పండిట్ సూత్రధారని, మరో విదేశీ మిలిటెంట్ కూడా ఉన్నాడని, వారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని అన్నారు. రెండు ప్రాంతాల్లో కార్డన్ సెర్చ్ ప్రారంభించామని తెలిపారు. ఈ దాడి జరిగిన ప్రాంతంలో అక్కడే ఉండి, సమయానికి ఉగ్రవాదులను అడ్డుకోలేకపోయిన నలుగురు అధికారులను సస్పెండ్ చేసినట్టు విజయ్ కుమార్ తెలియజేశారు.

More Telugu News