Mumbai: కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో ముంబై అధికారుల కీలక నిర్ణయం!

  • సోమవారం నాడు 5,888 కొత్త కేసులు
  • ప్రైవేటు ఆసుపత్రుల్లోని 100 శాతం ఐసీయూ బెడ్ల కేటాయింపు
  • లక్షణాలు లేనివారికి పడకలు కేటాయించ వద్దని ఆదేశాలు
BMC Officials New Orders on Corona

రోజురోజుకూ కరోనా కేసులు పెరిగిపోతున్న వేళ, ముంబై పురపాలక అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. అన్ని ఆసుపత్రులు, నర్సింగ్ హోమ్ లలో లక్షణాలు లేకుండా కరోనా పాజిటివ్ వచ్చిన వారికి బెడ్లను కేటాయించ వద్దని ఆదేశాలు జారీ చేశారు.

 కేవలం తీవ్రమైన లక్షణాలు ఉండి, అవసరమైన వారికి మాత్రమే ఆసుపత్రి పడకలు కేటాయించాలని స్పష్టం చేశారు. ఇప్పటికే లక్షణాలు లేకుండా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారిని సాధ్యమైనంత త్వరగా డిశ్చార్జ్ చేయాలని, తీవ్రమైన లక్షణాలతో వచ్చే వారికి అవసరమైన బెడ్లను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.

తాజాగా ఆదివారం నాడు ముంబై మహానగరంలో మరో 6,923 కరోనా కేసులు వచ్చిన సంగతి తెలిసిందే. ఆపై సోమవారం నాడు మరో 5,888 కొత్త కేసులు వచ్చాయి. దీంతో ప్రత్యేక సమీక్ష నిర్వహించిన బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ అధికారులు, అన్ని ఆసుపత్రుల్లో సాధ్యమైనన్ని ఎక్కువ పడకలు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.

ఈ సమావేశానికి ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేతో పాటు ఆరోగ్య మంత్రి రాజేష్ తోపే, ఆరోగ్య శాఖ కార్యదర్శి డాక్టర్ ప్రదీప్ వ్యాస్ తదితరులు హాజరయ్యారు. ఆసుపత్రుల్లో పడకలతో పాటు ఆక్సిజన్ సరఫరా, వెంటిలేటర్లు తదితరాలపై దృష్టిని సారించాలని, కేసుల సంఖ్య మరింతగా పెరిగితే తీసుకోవాల్సిన తదుపరి చర్యలపైనా నివేదిక ఇవ్వాలని సీఎం కోరారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో 80 శాతం, ప్రైవేటు ఆసుపత్రుల్లో 100 శాతం ఐసీయూ బెడ్స్ అందుబాటులో ఉంచాలని ఆదేశాలు జారీ చేశారు.

కాగా, మహారాష్ట్ర వ్యాప్తంగా సోమవారం నాడు 31,643 కొత్త కేసులు వచ్చాయి. ఆదివారం నాడు 40,414 కేసులు వచ్చాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 27.45 లక్షలను దాటింది. ఇప్పటివరకూ మొత్తం 54 వేల మందికి పైగా మరణించారు.

More Telugu News