Tamil Nadu: అన్నాడీఎంకే మాజీ ఎమ్మెల్యే పరమశివంకు నాలుగేళ్ల జైలు శిక్ష, రూ. 33 లక్షల జరిమానా

  • ఎమ్మెల్యేగా ఉన్న కాలంలో ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిన ఎమ్మెల్యే
  • అభియోగాలు నిజమేనని తేల్చిన కోర్టు
  • జరిమానా చెల్లించకుంటే అదనంగా మరో ఏడాది జైలు శిక్ష
Former AIADMK MLA convicted in assets case

అక్రమాస్తుల కేసులో దోషిగా తేలిన అన్నాడీఎంకే మాజీ ఎమ్మెల్యే పరమశివానికి విల్లుపురం కోర్టు నాలుగేళ్ల జైలు శిక్ష, రూ. 33 లక్షల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పింది. పరమశివం 1991లో విల్లుపురం జిల్లా చిన్నసేలం నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. అక్రమాస్తుల కేసులో దివంగత జయలలిత, శశికళ తదితరులపై దాఖలైన కేసుల్లో పరమశివం కూడా ఉన్నారు. 1991-96 మధ్య ఆయన ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించినట్టు 1998లో ఏసీబీ కేసు నమోదు చేసింది.

తొలుత ఈ కేసును విల్లుపురం కోర్టులో విచారించగా, ఆ తర్వాత చెన్నైలోని ప్రజాప్రతినిధుల కేసుల ప్రత్యేక కోర్టుకు మారింది. అక్కడ కొన్నాళ్లపాటు విచారణ జరిగిన తర్వాత మళ్లీ విల్లుపురం జిల్లా కోర్టుకు కేసును బదిలీ చేశారు.

తాజాగా జరిగిన విచారణలో పరమశివం ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించినట్టు నిర్ధారణ అయింది. దీంతో నిన్న ఆయనకు కోర్టు శిక్ష ఖరారు చేసింది. ఆయన సంపాదించిన ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని ఆదేశించిన కోర్టు నాలుగేళ్ల జైలు శిక్షతోపాటు రూ. 33 లక్షల జరిమానా విధించింది. జరిమానా చెల్లించకుంటే అదనంగా మరో ఏడాదిపాటు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని న్యాయమూర్తి తీర్పు చెప్పారు.

More Telugu News