PFizer: అత్యుత్తమ పనితీరు చూపిస్తున్న ఫైజర్, మోడెర్నా వ్యాక్సిన్ లు... అమెరికా అధ్యయనం!

  • తొలి డోస్ తోనే 80 శాతం ప్రభావం
  • రెండో డోస్ తరువాత 90 శాతం వైరస్ దూరం
  • నాలుగు వేల మందిపై అధ్యయనం
Pfizer Vaccine Highly Effective says US Study

బయోఎన్ టెక్ ఎస్, మోడెర్నా సహకారంతో ఫైజర్ సంస్థ తయారు చేసిన కొవిడ్ వ్యాక్సిన్ అత్యుత్తమంగా పనిచేస్తోందని యూఎస్ హెల్త్ కేర్ సంస్థ నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. ఈ టీకా తీసుకున్న వారిలో రెండు వారాల్లోనే కరోనా సోకే అవకాశాలు 80 శాతం మేరకు తగ్గాయని, తొలి దశ టీకా తీసుకున్న వెంటనే యాంటీ బాడీలు పెరుగుతున్నాయని అధ్యయనం పేర్కొంది. రెండో షాట్ తీసుకున్న రెండు వారాలకు ఇన్ఫెక్షన్ రిస్క్ 90 శాతం తగ్గిందని, దాదాపు 4 వేల మందిని పరిశీలించి ఈ అధ్యయనం చేశామని యూఎస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ తెలియజేసింది.

ఈ వ్యాక్సిన్ కరోనా నుంచి రక్షణ కల్పించడంతో పాటు, వైరస్ శరీరంలోకి వెళితే, లక్షణాలను కూడా బయటకు కనిపించనివ్వడం లేదని వెల్లడించింది. అమెరికాలో జరుగుతున్న వ్యాక్సినేషన్ మంచి ప్రభావాన్ని చూపుతూ, ప్రజలను కరోనాకు దూరం చేస్తోందని సీడీసీ డైరెక్టర్ రోచెల్లీ వాలెన్ స్కీ వ్యాఖ్యానించారు. ఫైజర్ సంస్థ మెసింజర్ ఆర్ఎన్ఏ విధానంలో వ్యాక్సిన్ ను రూపొందించిందని గుర్తు చేసిన ఆయన, అమెరికాలో ఈ వ్యాక్సిన్ కే తొలుత వాడకానికి అనుమతి లభించిందని తెలిపారు.

డిసెంబర్ 14 నుంచి 13 వారాల పాటు సాగిన ఈ అధ్యయనం, మార్చి 13 వరకూ సాగిందని, మొత్తం ఆరు రాష్ట్రాల నుంచి టీకా తీసుకున్న వారిలో 3,950 మందిని పరిశీలించామని సీడీసీ పేర్కొంది. ఈ టీకా అమెరికాలోని హెల్త్ కేర్ పర్సనల్స్, ఇతర ఫ్రంట్ లైన్ వర్కర్స్, వయో వృద్ధులకు కొవిడ్ నుంచి నిజమైన రక్షణను అందిస్తోందని వాలెన్ స్కీ వ్యాఖ్యానించారు. కాగా, అమెరికాలో ఈ వ్యాక్సిన్ ను అత్యవసర వినియోగం నిమిత్తం వాడేందుకు అనుమతి లభించగా, అప్పటి నుంచి భారీ ఎత్తున ప్రజలకు ఇస్తున్నారు. అయితే, ఈ వ్యాక్సిన్ ను అత్యంత శీతల ప్రదేశంలో భద్రపరచాల్సి వుండటంతో భారత్ సహా ఎన్నో దేశాలు ఈ వ్యాక్సిన్ సరఫరా కష్టమన్న ఉద్దేశంతో దూరం పెట్టాయి.

More Telugu News