China: భారత్, పాక్ చర్చల పట్ల చైనా హర్షం

China says its happy over India and Pakistan recent interactions
  • ఎల్ఓసీ వద్ద కాల్పుల విరమణ అమలు
  • ఇటీవల పేలని తూటా
  • ఒప్పందాలను గౌరవించాలని భారత్, పాక్ నిర్ణయం
  • రెండు దేశాల నిర్ణయం పట్ల స్పందించిన చైనా విదేశాంగ శాఖ
ఎంతోకాలంగా కాల్పుల మోతతో దద్దరిల్లిన భారత్-పాకిస్థాన్ సరిహద్దుల్లో ప్రస్తుతం నిశ్శబ్దం రాజ్యమేలుతోంది. కాల్పుల విరమణ పాటించాలని ఇరువర్గాలు ఏకాభిప్రాయానికి రావడమే అందుకు కారణం. కాగా, భారత్-పాక్ మధ్య సరిహద్దు సయోధ్యపై చైనా హర్షం వ్యక్తం చేసింది.

ఇటీవల భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య చురుగ్గా సాగుతున్న చర్చలు చైనాకు ఆనందం కలిగిస్తున్నాయని ఆ దేశ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఝావో లిజియాన్ వెల్లడించారు. సరిహద్దుల్లో శాంతి, స్థిరమైన పరిస్థితులు కొనసాగించడంలోనూ, అభివృద్ధి దిశగా ముందంజ వేయడంలోనూ మరింత ఉత్తేజాన్ని పెంపొందించేందుకు తాము పాకిస్థాన్ తో కలిసి పనిచేస్తామని వివరించారు.

పాక్ దేశాధ్యక్షుడు ఆరిఫ్ అల్వీ ఇటీవల మాట్లాడుతూ, తమ దేశానికి చైనానే అత్యంత స్నేహపూర్వక దేశమని పేర్కొన్నారు. అల్వీ వ్యాఖ్యలపై స్పందిస్తూ ఝావో లిజియాన్ తాజా వ్యాఖ్యలు చేశారు.

కాగా, కాల్పుల విరమణ ఒప్పందానికి కట్టుబడి ఉంటామని ఫిబ్రవరి 25న జరిగిన చర్చల్లో భారత్, పాక్ సైనిక ఉన్నతాధికారులు ఏకాభిప్రాయానికి వచ్చారు. ఎల్ఓసీ పొడవునా అన్ని ఒప్పందాలను కచ్చితంగా పాటించాలని నిర్ణయించారు. ఆ తర్వాత కొన్నిరోజులకే పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, ఆ దేశ సైనిక జనరల్ ఖమర్ జావేద్ బజ్వా శాంతి వచనాలు పలికారు. రెండు దేశాలు గతాన్ని సమాధి చేసి, భవిష్యత్ వైపు అడుగులు వేయాల్సిన సమయం వచ్చిందని అన్నారు.
China
Inda
Pakistan
Zhao Lijian
Cease Fire
LOC
Jammu And Kashmir

More Telugu News