Chandrababu: తెలుగు ప్రజల రుణం తీర్చుకునేందుకు ఎన్టీఆర్ ఆవేశంలోంచి పుట్టిన పార్టీ ఇది: టీడీపీ ఆవిర్భావ వేడుకల్లో చంద్రబాబు

  • 40వ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్న టీడీపీ
  • అమరావతి ఎన్టీఆర్ భవన్ లో వేడుకలు
  • కేక్ కట్ చేసిన చంద్రబాబు
  • ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు
  • మొక్క నాటిన లోకేశ్
Chandrababu attends TDP Emergence Day celebrations in NTR Bhavan

టీడీపీ 40వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అమరావతిలోని ఎన్టీఆర్ భవన్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జెండా ఆవిష్కరించిన అధినేత చంద్రబాబు టీడీపీ 4 దశాబ్దాల ప్రస్థానానికి గుర్తుగా కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, తెలుగు ప్రజల రుణం తీర్చుకునేందుకు ఎన్టీఆర్ ఆవేశంలోంచి పుట్టిన పార్టీ టీడీపీ అని పేర్కొన్నారు. రాజకీయం కోసమో, అధికారం కోసమో నాడు ఎన్టీఆర్ పార్టీని ఏర్పాటు చేయలేదని వివరించారు. అన్నివిధాలుగా నష్టపోతున్న తెలుగుజాతి కోసం పార్టీ స్థాపించారని వెల్లడించారు.

ఒక ప్రాంతీయ పార్టీగా మొదలైన టీడీపీ జాతీయస్థాయిలో విపక్షంగా పనిచేసిందని, ఆ ఘనత ఒక్క టీడీపీకే సొంతమని అన్నారు. ఎన్టీఆర్ ను సీఎం పీఠంపై కూర్చోబెట్టేవరకు పోరాటాలు చేసిన జాతి తెలుగుజాతి అని ఉద్ఘాటించారు. తాను సీఎం అయ్యాక తెలుగుజాతి గౌరవాన్ని పెంపొందించేందుకు అనేక కార్యక్రమాలకు రూపకల్పన చేశానని వెల్లడించారు. పేదల పక్కా ఇళ్లకు 40 ఏళ్ల కిందటే శ్రీకారం చుట్టిన పార్టీ టీడీపీ అని పేర్కొన్నారు.

అంతేగాకుండా, వైసీపీ సర్కారుపై విమర్శలు చేశారు. 28 మంది ఎంపీలున్న వైసీపీ కేంద్రం నుంచి ఏం తెచ్చిందో చెప్పాలని, హోదా ఎందుకు తీసుకురాలేదో వివరించాలని చంద్రబాబు నిలదీశారు. రాష్ట్రాభివృద్ధి రివర్స్ గేరులో పయనిస్తోందని వ్యాఖ్యానించారు. ఈ రెండేళ్లలో ప్రతి కుటుంబంపై రూ.2.5 లక్షల భారం మోపారని తెలిపారు. సామాన్య ప్రజలు బతకలేని విధంగా అన్ని ధరలు పెంచేశారని ఆరోపించారు. కరోనా సంక్షోభం తర్వాత ఆర్థిక అసమానతలు బాగా పెరిగాయని అభిప్రాయపడ్డారు.

జగన్ రెండేళ్ల పాలనలో ఉద్యోగాలు ఇచ్చే ఒక్క పరిశ్రమనైనా తెచ్చారా? అని ప్రశ్నించారు. కేసుల మాఫీ కోసం విశాఖ ఉక్కు పరిశ్రమను తాకట్టు పెట్టారని విమర్శించారు. నాసిరకం మద్యంతో వేల కోట్ల రూపాయలు దండుకుంటున్నారని మండిపడ్డారు. రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో పడిందని, ఆదాయానికి మించి అప్పులు చేయడం దివాలా కాక మరేమిటని అన్నారు.

ఈ కార్యక్రమంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, నేతలు వర్ల రామయ్య, ఆలపాటి రాజా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయ ఆవరణలో లోకేశ్ మొక్క నాటారు. అటు, రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ శ్రేణులు పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నారు.

  • Loading...

More Telugu News